లీగల్‌ ప్రొఫెషన్‌లో నేటికీ మహిళలకు సవాళ్లు

లీగల్‌ ప్రొఫెషన్‌లో నేటికీ మహిళలకు సవాళ్లు

సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైకోర్టుల్లోనూ ఖాళీల భర్తీకి సిఫార్సు చేశామని, కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. కోర్టుల్లో మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, వారంలో కేంద్రానికి పూర్తి నివేదిక అందిస్తామని చెప్పారు. శనివారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ ప్రొఫెషన్‌లో నిలదొక్కుకొనేందుకు మహిళలు నేటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.

అప్పట్లో మహిళలకు కనీసం టాయ్‌లెట్లు లేవు

‘‘ఇప్పటికీ జుడిషియరీలో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. అందులోనూ అతి కొద్ది మంది మాత్రమే న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు. నేటికీ చాలా సీరియస్ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత బెంచ్‌లో 11 శాతం మహిళల ప్రాధాన్యం సాధ్యమైంది.  న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్​ కొరత తీవ్రంగా వేధిస్తోంది. నా లాయర్ ప్రాక్టీస్ రోజుల్లో మహిళలకు కనీసం టాయ్‌లెట్స్ ఉండేవి కాదు. నేను హైకోర్టు తాత్కాలిక చీఫ్​ జస్టిస్ అయ్యాక ఆ టాయ్‌లెట్స్ కట్టేందుకు ముందడుగు పడింది’’ అని సీజేఐ రమణ అన్నారు. ఇప్పటికీ చాలా కోర్టులు బ్రిటీష్ కాలంలో కట్టిన బిల్డింగ్స్‌లోనే నడుస్తున్నాయని, వాటిలో సరైన సదుపాయాలు లేవని, లాయర్లు, పిటిషనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. దేశంలోని అన్ని కోర్టుల్లో సదుపాయాల కొరత గురించి  సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నామని, మరో వారంలో న్యాయ శాఖ మంత్రికి దానిని అందజేస్తామని తెలిపారు.