పటాకుల గోడౌన్‌లో పేలుడు: ముగ్గురు మృతి

పటాకుల గోడౌన్‌లో పేలుడు: ముగ్గురు మృతి

ఇళ్ల మధ్యలో అక్రమంగా ఏర్పాటు చేసి పటాకుల గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించి.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.

ఆగ్రాలోని అజం పారా ఏరియాకు చెందిన చమన్ మన్సూరి అనే ఫైర్ క్రాకర్స్ కాంట్రాక్టర్ దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో ఇళ్ల మధ్యనే పటాకుల గోడౌన్ ఏర్పాటు చేశాడు. చుట్టూ జనాలు నివసించే ప్రాంతంలో పటాకుల గోడౌన్ పెట్టకూడదన్న రూల్స్ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా అక్రమంగా దీనిని ఏర్పాటు చేశారు.

చాలా ఇరుగు గల్లీల మధ్య ఉన్న ఈ గోడౌన్‌లో ఆదివారం ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. దీంతో భారీ శబ్ధంతో పాటు చుట్టుపక్కల సుమారు అర కిలోమీటర్ దూరం వరకు భూమి కంపించినట్లుగా అనిపించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్, గోడలు కూలిపోయాయి. దీంతో ఆ సమయంలో లోపల ఉన్న ఫర్మాన్, షెరూ, షకీల్ అనే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మన్సూరి కుమార్తె ఆస్మా, కొడుకు అర్షద్ కూడా ఈ ఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టూ ఇళ్లు ఉన్న ఈ ఇరుకు గల్లీలో పటాకుల గోడౌన్ ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఎలా వచ్చిందన్న దానిపై పరిశీలిస్తున్నామని ఆగ్రా సిటీ ఎస్పీ రోహాన్ ప్రమోద్ తెలిపారు. ఎటువంటి ఏరియాలో గోడౌన్ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలకు కూడా ప్రమాదమేనని అన్నారు. పేలుడు జరిగిన తర్వాత ఫైరింజన్ ఘటనా స్థలానికి రావడానికి వీలు కాలేదని, చుట్టపక్కల ఉన్న ఇళ్లపైకి ఎక్కి ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పారని చెప్పారు. గోడౌన్ సీలింగ్ కూలిపోవడంతో దాని కింద చిక్కుకున్న వాళ్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించామన్నారు.