మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిందేవాహి తాలూకా గుంజవాహి అటవీ ప్రాంతంలో మే 22న శుక్రవారం ఉదయం జరిగిన పులి దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అడవిలో తునికి ఆకుల సేకరణ సమయం కావడంతో, గుంజవాహి గ్రామానికి చెందిన మహిళల బృందం ఎప్పటిలాగే తెల్లవారుజామున అడవిలోకి వెళ్లారు. తమ జీవనాధారం కోసం బీడీ తయారీకి తునికి ఆకులు సేకరిస్తున్న క్రమంలో.. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దట్టమైన పొదల చాటునుంచి ఒక పులి వీరిపై ఒక్కసారిగా పంజా విసిరింది. కనురెప్ప మూసి తెరిచేలోపు పులి దాడి చేయడంతో.. ఆ మహిళలకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రూర మృగం దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఒకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మరణించారన్న వార్త తెలియగానే.. చుట్టుపక్కల గ్రామాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సిందేవాహి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంజలి సాయంకర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళలు కవదుబాయి దాదాజీ మోహుర్లే, అనుబాయి దాదాజీ మోహుర్లే, సంగీత సంతోష్ చౌదరి, సునీత కౌశిక్ మోహర్లే గా గుర్తించారు.
ఈ దారుణ ఘటనతో అటవీ ప్రాంత సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకై వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూ.. ఆ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు.
