జైలులో మంత్రికి వీఐపీ సౌకర్యాలు.. తీహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్

జైలులో మంత్రికి వీఐపీ సౌకర్యాలు.. తీహార్ జైలు సూపరింటెండెంట్ సస్పెండ్

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్‌కు జైలులో సకల సదుపాయాలు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాల మేరకు జైలు విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు.  అనంతరం తీహార్ జైలు సూపరెంటెండెంట్‌అజిత్‌ కుమార్‌పై వేటు వేశారు. జైలు నిబంధనల విషయంలో అజిత్‌ అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ జైళ్ల శాఖ వెల్లడించింది. రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ చంద్రశేఖర్‌.. ఇటీవల సత్యేంద్ర జైన్‌ సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. సుకేశ్‌ కూడా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉండగా..  జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ సత్యేంద్ర జైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని సుకేశ్ ఆరోపించాడు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి జైన్‌ తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవలే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ కూడా రాశాడు. అంతేగాక, తీహార్ జైల్లోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు వీఐపీ సేవలు అందుతున్నాయని ఆరోపించాడు.

దీంతో సుకేశ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎల్జీ సక్సేనా.. ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తులో తీహార్ జైల్లో అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే జైలు సూపరెంటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ జైలు ఉన్నతాధికారులకు ప్రతిపాదించింది. దీంతో అధికారులు అజిత్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. సత్యేంద్ర జైన్‌కు జైల్లో ప్రత్యేక ఆహారం అందిస్తున్నారని, అనుమతించిన వేళలకు మించి కొందరు ఆయనకు మసాజ్‌లు వంటివి చేస్తున్నారని ఇటీవల ఈడీ కూడా తన దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్‌ కేసులో జైన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నవంబరు 16న కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.