సర్కారు విధానాలపై నిరసనగా ఈరోజు భారత్​ బంద్

సర్కారు విధానాలపై నిరసనగా ఈరోజు భారత్​ బంద్

న్యూఢిల్లీకేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్​ యూనియన్లు బుధవారం భారత్​బంద్​కు పిలుపునిచ్చాయి. లేబర్​రిఫార్మ్స్​ప్రతిపాదనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్​ సహా మొత్తం 14 డిమాండ్లను సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. కేంద్ర కార్మిక శాఖకు సెప్టెంబర్ చివరిలోనే బంద్ నోటీసులు ఇచ్చాయి. పది సంఘాల నేతలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో ఈ నెల 2న చర్చలు కూడా జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో బంద్​ కొనసాగుతుందని ప్రకటించారు. ఈ బంద్​కు ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా జరిగే ఈ బంద్‌‌లో దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని వారు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రైవేటు రవాణాపై ఎఫెక్ట్ పడబోతోంది.

ఇవీ డిమాండ్లు..

ప్రధానంగా లేబర్​ రిఫార్మ్స్​ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడంపై సంఘాలు పట్టుబడుతున్నాయి
కనీస వేతనం నెలకు రూ.21,000 నుంచి రూ.24,000 వరకు ఇవ్వాలి
సీఏఏ రద్దు, ఎన్నార్సీ, ఎన్​పీఆర్​ అమలును ఉపసంహరించుకోవడం
పబ్లిక్​ సెక్టార్ అండర్​టేకింగ్స్​ను ప్రైవేటీకరించే ప్రయత్నం మానుకోవాలి

బంద్​లో ఎవరెవరు?

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ (సీఐటీయూ), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (ఏఐయూటీయూసీ), హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్), సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్ (ఎస్ఈడబ్ల్యూఏ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ), లేబర్ ప్రొగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్‌‌పీఎఫ్), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటీయూసీ), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌‌టీయూసీ), ట్రేడ్ యూనియన్ కో–ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) వంటి యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

రాజకీయపార్టీల మద్దతు

ట్రేడ్​ యూనియన్ల బంద్​ పిలుపుకు తమిళనాడులోని ఎండీఎంకే, డీఎంకే పార్టీలతో పాటు మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కూడా మద్దతు ప్రకటించింది. శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఉద్యోగులకు మద్దతిచ్చేందుకు నిరాకరించారు.

బంద్ ప్రభావం

బ్యాంకింగ్, రవాణా రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. కార్మిక, ఉద్యోగ సంఘాలతో కూడిన బ్యాంకింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) భారత్ బంద్ కు మద్దతు ఇచ్చింది. ఈ ఫెడరేషన్ లో సుమారు పది వరకు వివిధ అసోసియేషన్లు పని చేస్తున్నాయి.