ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటి నుంచి సీబీఐ విచారణ చేపట్టాలి:​ రేవంత్​

ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటి నుంచి సీబీఐ విచారణ చేపట్టాలి:​ రేవంత్​
  • కొనుగోళ్ల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేయాలనుకుంటున్నం
  • ఈ కేసులో బీజేపీ, బీఆర్​ఎస్​ తీరుపై అనుమానాలున్నాయని కామెంట్
  • గాంధీభవన్​లో పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను ఫిరాయింపుల నుంచి మొదలుపెట్టాలని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీ మారిన వాళ్లేనని, వీళ్లకు నేరం అలవాటుగా మారిందన్నారు. బుధవారం ఆయన  గాంధీభవన్​లో మీడియాతో చిట్​చాట్​చేశారు. పదవులు, ఇతర పనుల కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ నుంచి వెళ్లారని, బీఆర్​ఎస్​ కూడా వాళ్లు అడిగింది చేసి పెట్టిందన్నారు. ఇది కూడా కరప్షన్​కిందకే వస్తుందన్నారు. ఆ వ్యవహారంపై విచారణ జరపకుంటే కొనుగోళ్ల కేసు ఇన్​కంప్లీట్​గా మిగిలిపోతుందన్నారు. ఈ కేసులో తాము ఇంప్లీడ్​ పిటిషన్ వేయాలా, వద్దా అన్న దానిపై చర్చిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో రెండు పార్టీల వైపు ఉన్న వారిని బాధితులు, దోషులుగా చూపిస్తున్నారని, ఎవరు దోషులు, ఎవరు బాధితులో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు.  నేరం జరిగిందని, తామే విచారణ చేస్తామని బీఆర్​ఎస్​ పెద్దలు అనడం అనుమానాలకు తావిచ్చిందని, నేరం జరగలేదంటూనే సీబీఐ విచారణ కోరడంతో బీజేపీ తప్పిదం బయటపడిందని అన్నారు. 2 పార్టీలూ రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయన్నారు.

జనవరి 26 నుంచి పాదయాత్ర

‘యాత్ర’ పేరిట జనవరి 26 నుంచి జూన్​2 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు రేవంత్​రెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కోసమే ‘హాత్​ సే హాత్​ జోడో’ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. పార్టీలో వర్గాలేవీ లేవని, అంతర్గత విషయాలను బయటకు చెప్పబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. షర్మిల, బీఎస్పీ, టీడీపీ లాంటి పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చినా గెలిచేది మాత్రం కాంగ్రెసేనన్నారు. కేసీఆర్ గ్రాఫ్​పడిపోయిందని, 2023 ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ కనిపించదన్నారు. 

బ్రిటిష్​ కాలం నాటి విధానాలను రుద్దే ప్రయత్నం

దేశంలో ఇప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వ పరిస్థితులున్నాయని రేవంత్​ రెడ్డి విమర్శించారు. పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్​లో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటీష్​ కాలం నాటి విధానాలను ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. వాటికి వ్యతిరేకంగానే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందుకెళ్లడానికి ఇందిర, రాజీవ్​గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ​కార్యకర్తలు అంకితభావంతో పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బుధవారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా రేవంత్​ ఆయన ఫొటోకు నివాళి అర్పించారు.