భూ సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు 

భూ సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు 
  • ఆఫీసర్లు వెళ్లేంత వరకు నినాదాలు 

హుజుర్ నగర్, (మఠంపల్లి) వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాలో తమకు తెలియకుండా తమ భూముల్లో సర్వే చేస్తున్నారని గిరిజనులు ఆఫీసర్లను అడ్డుకున్నారు. వారు వెళ్లేంత వరకు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మంగళవారం మఠంపల్లి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ఐ సీతారామారావు, సర్వేయర్ నరేశ్​  మాంచ్యతండా (రాఘవాపురం) స్టేషన్ నుంచి ఓ ప్రైవేట్ ​సిమెంట్ ఫ్యాక్టరీకి రైల్వే లైన్​వేయడానికి  భూ సేకరణ కోసం వచ్చారు. సర్వే చేస్తుండగా ఏం చేస్తున్నారని గిరిజనులు అడగ్గా విషయం చెప్పారు. ప్రైవేట్ ​సిమెంట్ ఫ్యాక్టరీకి పట్టాభూములను ఎలా తీసుకుంటారని తహసీల్దార్, ఆర్ఐలను అడ్డుకున్నారు. ఈ నెల 24న కూడా ఇలాగే సర్వే కోసం రాగా తిప్పి పంపారు.

మళ్లీ మంగళవారం రావడంతో తండావాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రెవెన్యూ ఆఫీసర్లు ఫ్యాక్టరీ మేనేజ్​మెంట్​తో కుమ్మక్కై తమను బెదిరిస్తున్నారని గిరిజన రైతులు  ఆరోపించారు. గతంలో కొంత భూమిని సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చామని, ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. సిమెంట్​ఫ్యాక్టరీ వల్ల పశువులకు మేత దొరకడం లేదని, తమ బతకుకు ఆధారమైన కొద్ది భూములను రైల్వే లైన్​కోసం వదులుకోలేమని స్పష్టం చేశారు. ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లేంత వరకు నినాదాలు చేయడంతో సర్వే చేయకుండానే వెనుదిరిగారు.  

కలెక్టర్​చెప్తేనే వచ్చాం
సూర్యాపేట కలెక్టర్ ఆదేశాల మేరకు రైల్వే లైన్ కోసం భూ సర్వే చేయడానికి వెళ్లాం. మూడు రోజుల క్రితం ఆర్ఐ ,సర్వేయర్లు వెళ్లగా గిరిజనులు సర్వే చేయవద్దంటే తిరిగి వచ్చారు. బుధవారం మళ్లీ సిబ్బందితో సర్వే కోసం వెళ్లగా  గిరిజనులు తమ భూమి  ఇచ్చేదిలేదని, సర్వే చేయ వద్దని అంటే తిరిగొచ్చాం. -లక్ష్మణ్ బాబు, తహసీల్దార్