కోట్లలో ఇసుక దోపిడీ

కోట్లలో ఇసుక దోపిడీ

దర్యాప్తు చేయాలని వివేక్​ వెంకటస్వామి డిమాండ్​

కామారెడ్డి, పిట్లం, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుక దందాతో టీఆర్ఎస్ లీడర్లు అక్రమంగా సంపాదిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక దందాతో పేద ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘పల్లె గోస-– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా ఆరో రోజైన మంగళవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో వివేక్ పర్యటించారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతారతో కలిసి వివేక్.. శేట్లూర్​, దోతి, ఖత్‌‌గావ్, గుండె కల్లూరు, కల్లాలి, రాజుల, కందర్‌‌‌‌పల్లి,  మెక్కా, గోపాన్‌‌పల్లిలో బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రాలేదని, దళితులకు భూమి ఇవ్వలేదని, రోడ్లు, మోరీలు సరిగ్గా లేవని, ఇసుక లారీలు తిరగటంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని  స్థానికులు తెలిపారు.

ఇసుక దందా పెరిగింది.. విచారణ జరపాలి

కొద్ది రోజుల కిందట నది దాటుతూ శేట్లూర్‌‌‌‌కు చెందిన నలుగురు వ్యక్తులు గుంతలో మునిగి చనిపోగా.. వారి ఫ్యామిలీ మెంబర్లను వివేక్ పరామర్శించారు. తర్వాత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇసుక మాఫియా నదిలో తవ్విన గుంతల్లో మునిగి శేట్లూర్‌‌‌‌కు చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారని చెప్పారు. ఇసుక తవ్వి.. గుంతలను చదును చేయకపోవటంతో వారు చనిపోయారని, బాధిత ఫ్యామిలీకి ఇప్పటిదాకా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇసుక దందా పెరిగిందన్నారు. గతంలో సిరిసిల్ల, మహబూబ్‌‌నగర్ జిల్లాల్లో ఇసుక దందా వల్ల ఇద్దరు దళితులు చనిపోయారని చెప్పారు. ఇసుక లారీలతో జరిగిన యాక్సిడెంట్లలో చాలా మంది చనిపోయారన్నారు. ఇసుక దందాతో టీఆర్ఎస్ లీడర్ల జేబుల్లోకి కోట్ల కొద్దీ సొమ్ము పొతున్నదన్నారు. ఇసుక ఎంత తవ్వుతున్నారు, సర్కారుకు ఎంత పన్నులు చెల్లిస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక దందాతో  అక్రమ సంపాదన పొందుతున్న టీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేయాలన్నారు.

దళితులపై సీఎం వివక్ష

దళితులకు 3 ఎకరాల భూమిస్తే అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతోనే కేసీఆర్ భూ పంపిణీ చేపట్టలేదని వివేక్ ఆరోపించారు. దళితులకు భూమి ఇచ్చి ఉంటే పంటలు సాగు చేసుకునే వాళ్లని, భూమి విలువ కూడా పెరిగేదని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌‌‌‌కు దళితులు గుర్తుకువస్తారని, మళ్లీ మరిచిపోతారన్నారు. మాయమాటలు చెప్పి మరిచిపోవటంతో కేసీఆర్‌‌‌‌ను మించిన వాళ్లు లేరన్నారు. దళితులకు సీఎం పదవి ఇస్తానని ఇవ్వలేదని, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి తర్వాత వారినీ తొలగించారన్నారు. రిటైర్‌‌ అయిన 250 మంది ఆఫీసర్లను మళ్లీ తీసుకున్నారని, ఇందులో ఒక్క దళిత ఆఫీసర్ కూడా లేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేవలం కేసీఆర్ ఫామ్​హౌస్‌‌కే నీళ్లు వచ్చాయన్నారు. అవినీతి, దగాకోరు సీఎంను గద్దె దించితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

కష్టకాలంలో మోడీ అండగా నిలిచారు

కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండగా నిలిచారని వివేక్​ తెలిపారు. దేశంలో 4 కోట్ల ఇండ్ల నిర్మాణం చేపట్టారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ద్వారానే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. బీజేపీని బలపర్చాల్సిన అవసరముందన్నారు. ప్రజలంతా కలిసి కేసీఆర్‌‌‌‌ను గద్దె దించాలన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వివేక్ అన్నారు. పార్టీ మండల ప్రెసిడెంట్ కిష్టారెడ్డి, యూత్ ప్రెసిడెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.