కృష్ణా బోర్డు మీటింగ్​లో  ఏం చెప్దాం?

కృష్ణా బోర్డు మీటింగ్​లో  ఏం చెప్దాం?

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్​లో ఏం చెప్పాలనే దానిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి బోర్డుల కో ఆర్డినేషన్ మీటింగ్ లతో పాటు ఫుల్ బోర్డు సమావేశాలకు డుమ్మా కొట్టిన సర్కారు.. ఈ నెల 27న నిర్వహించే కేఆర్ఎంబీ 14వ సమావేశం కోసం కసరత్తు చేస్తోంది. వరుసగా మీటింగ్​లకు తెలంగాణ హాజరుకాకపోవడాన్ని బోర్డులు కేంద్రానికి చేరవేయడంతో  27న నిర్వహించే సమావేశానికి వెళ్లాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేఆర్ఎంబీ మీటింగ్​లో రాష్ట్రం అనుసరించాల్సిన వైఖరిపై సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం అధికారులు, ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై ఈ నెల 25న మరోసారి సమావేశమై చర్చిద్దామని సీఎం చెప్పినట్టు తెలిసింది. 

వరుసగా మీటింగ్​లకు డుమ్మా

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డుల ఆపరేషనల్ స్ట్రక్చర్ పై రెండు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి 30 రోజుల్లోగా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని గెజిట్ లోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం జలసౌధలో నిర్వహించగా.. అదే బిల్డింగ్ లో ఉన్న తెలంగాణ ఇంజనీర్లు మాత్రం మీటింగ్ కు రాలేదు. ఈ నెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల పూర్తి స్థాయి సమావేశం జలసౌధలోనే నిర్వహించారు. ఈ సమావేశం కూడా అదే బిల్డింగ్​లో ఉన్నప్పటికీ  అధికారులు, ఇంజనీర్లు హాజరు కాలేదు. కో ఆర్డినేషన్, ఫుల్ బోర్డుల మీటింగుల్లో చర్చించిన అంశాలు, తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాలకు గైర్హాజరైన విషయాన్ని ఆయా సమావేశాల మినిట్స్ లో రికార్డు చేసి కేంద్రానికి బోర్డులు పంపాయి. ఈ సమావేశాలకు హాజరైన ఏపీ అధికారులు గెజిట్ అమలుకు సహకారిస్తామని చెప్పారు. అయితే.. గెజిట్ పై తమ అభ్యంతరాలను కేంద్రానికే నివేదిస్తామని పేర్కొన్నారు. అదే విషయం మినిట్స్ లో రికార్డు అయింది. తెలంగాణ సర్కారు కూడా  సమావేశాలకు హాజరై ఇదే విషయం చెప్పి ఉంటే బాగుండేదని తెలంగాణ ఇంజనీర్లు కూడా అంటున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు రాకపోవడంతోనే ఈ మీటింగులకు అధికారులు, ఇంజనీర్లు డుమ్మా కొట్టాల్సి వచ్చిందని చెప్తున్నారు. 

వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వస్తాయని..!

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్న బోర్డుల మీటింగ్​లకు డుమ్మా కొడుతుండటం తప్పుడు సంకేతాలకు కారణమవుతోందని రాష్ట్ర సర్కారు ఆలస్యంగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే  ఈ నెల 27న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వాదనను వినిపించడంతో పాటు ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఎండగట్టాలని సీఎం సూచించారు. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ పనులు చేస్తున్న విషయం తెలిసినా ఇన్నాళ్లూ  నోరువిప్పని రాష్ట్ర సర్కారు ఇప్పుడు బోర్డు మీటింగ్ లో ఆ ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించింది. ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకం విషయంలోనూ ఉదాసీనంగా ఉన్న సర్కారు ఇప్పుడు దానిని ఎండగట్టాలని భావిస్తోంది. రాయలసీమకు వరద నీళ్లు తీసుకుంటే అభ్యంతరం లేదని ఇన్నాళ్లుగా చెప్తున్న కేసీఆర్.. బోర్డు మీటింగ్​లో కృష్ణా బేసిన్ అవతలికి నీటిని తరలించకుండా బోర్డు నియంత్రించేలా ఒత్తిడి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు రీ డిజైన్ చేయాల్సి వచ్చిందో సవివరంగా చెప్పాలని సూచించారు. సీఎం ఆదేశాలతో వాదనలు వినిపించేందుకు అవసరమైన పాత జీవోలు, ఇతర సపోర్టెడ్ డాక్యుమెంట్లను సిద్ధం చేయడంలో ఇంజనీర్లు సన్నద్ధమవుతున్నారు. దీనిపైనే ఈ నెల 25న మరోసారి సమావేశం నిర్వహించి, బోర్డు మీటింగ్ ఎజెండాలోని ఏ అంశంపై ఎలాంటి వాదనలు చేయాలో సీఎం వివరించనున్నారు.