ఎవరెస్ట్ను అధిరోహించి తిరిగొస్తుండగా ఇద్దరు ఇండియన్లు మృతి

ఎవరెస్ట్ను అధిరోహించి తిరిగొస్తుండగా ఇద్దరు ఇండియన్లు మృతి

న్యూఢిల్లీ: ఎవరెస్ట్‎ను అధిరోహించిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. పర్వతాన్ని అధిరోహించిన తర్వాత కిందకు దిగుతుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు చనిపోయారు. మృతులను అరుణ్ తివారీ, సందీప్ ఆరెగా గుర్తించారు. ఇద్దరూ గురువారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నారు. తర్వాత కిందకు దిగుతున్న టైంలో మొదట అరుణ్  తీవ్రంగా అలసిపోయాడని నేపాల్  సాహసయాత్ర నిర్వాహకుల సంఘం సెక్రటరీ జనరల్  రిషి భండారీ మీడియాకు తెలిపారు.

 ‘‘ఎవరెస్ట్  ఎక్కిన తర్వాత అరుణ్ ఇద్దరు షెర్పా గైడ్ల సాయంతో కిందకు దిగుతున్నాడు. అనుకోకుండా అతను తీవ్ర అస్వస్థత, అలసటకు గురయ్యాడు. అతనిని కాపాడడానికి షెర్పా గైడ్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. హిల్లరీ స్టెప్  వద్ద అరుణ్  మృతి చెందాడు. అలాగే, మరో భారతీయ పర్వతారోహకుడు సందీప్  ఆరె క్యాంప్ 2 వద్ద చనిపోయాడు” అని రిషి భండారీ వెల్లడించారు. 

కాగా.. 21 ఏండ్ల ఇండియన్  సానిక షాతో పాటు పలువురు భారతీయులు, బార్డర్  సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తో కూడిన మహిళా పర్వతారోహకుల బృందం విజయవంతంగా ఎవరెస్ట్​ను అధిరోహించారని భండారీ చెప్పారు. ఒక్క బుధవారమే 247 మంది క్లైంబర్లు నేపాల్  వైపు నుంచి ఎవరెస్ట్  శిఖరాన్ని చేరుకున్నారని వివరించారు. అంతలోనే  ఇద్దరు ఇండియన్  క్లైంబర్లు చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

కాగా..  ఇటీవలే ఎవరెస్ట్  శిఖరం అధిరోహించడానికి పర్వతారోహకులను అనుమతి ఇచ్చారు. ఈ నెల 13న రోప్  ఫిక్సింగ్​ను పూర్తిచేశారు. ఈ సీజన్ లో ఎవరెస్ట్ ను అధిరోహించడానికి 493 పర్మిట్లను అధికారులు జారీ చేశారు. ఒక సంవత్సర కాలంలో ఇన్ని పర్మిట్లను జారీ చేయడం ఇదే మొదటిసారి.