కొత్తగూడెం జిల్లా లో ఎదురుకాల్పులు…ఇద్దరు మావోలు హతం

కొత్తగూడెం జిల్లా లో ఎదురుకాల్పులు…ఇద్దరు మావోలు హతం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.

ఆగస్టు 6న బంద్‌ పేరుతో మావోయిస్టులు దాడులకు కుట్ర పన్నారని కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ తెలిపారు. భద్రతా బలగాలు, ప్రజాప్రతినిధులపై దాడులకు కుట్ర పన్నినట్లు సమాచారం అందిందన్నారు. దీంతో చర్ల అటవీ ప్రాంతంలో బలగాలను అలర్ట్ చేసి మావోల కోసం విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టామని చెప్పారు. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు పూసుగుప్పలో పోలీసులు-మావోయిస్టుల మధ్య 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయన్నారు.ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ తెలిపారు. ఘటనాస్థలంలో ఎస్‌బీబీఎల్‌ తుపాకీ, పిస్టల్‌, రెండు కిట్‌ బ్యాగులను స్వాధీనం చేసుకున్నామన్నారు.కాల్పులు జరిగిన ప్రదేశంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు.