May Day : కార్మికులు అంటే ఎండలో పని చేసేవాళ్లే కాదు.. కంప్యూటర్ ఉద్యోగులు కూడా..!

May Day : కార్మికులు అంటే ఎండలో పని చేసేవాళ్లే కాదు.. కంప్యూటర్ ఉద్యోగులు కూడా..!

ఈ రోజు 'మేడే', పట్నాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఎన్నడూ లేని హడావిడి ఉండే రోజు ఇది. ఎర్రజెండాల రెపరెపలు, లీడర్ల బల ప్రదర్శనలు, కార్మికుల ఊరేగింపులు, కార్మికులకు దావత్లు, నాయకులకు సన్మానాలు అబ్బో..! మేడేని ఎన్నో తీర్లుగా జరుపుకుంటున్నరు. శ్రామికుల దినోత్సవమైన 'మేడే  సందర్భంగా V6 స్పెషల్ స్టోరీ.  

సీతారాముల కల్యాణము చూతము రారండి" పాటలేకుండా శ్రీరామ నవమి వేడుక లేనట్టే, 'ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియలో" పాట లేకుండా మేడే లేదు. ఆ రోజున చెవులు. రింగుమనిపించేలా మ్రోగే ఈ ప్రభాతగీతాన్ని మోగిస్తూ కంపెనీల ముందు జెండాలు ఎగరేస్తారు. ఆ తర్వాత నేతల ప్రసంగాలు. తెలిసిందే. 'మూడు దశాబ్దాల క్రితం ఈ ఊరేగింపు ఓ ఉత్సవంలా ఉండేదని సింగరేణిలో సివిల్ వర్కర్ గా పనిచేస్తున్న సదానంద్, (రామగుండం) అంటున్నడు. 'మా' బాపు కార్మికుడు. నా చిన్నప్పుడు ఆ కార్మికుల ర్యాలీని చూసి ఊరంతా తిరిగేవాళ్లం. అప్పట్లో జీతాలు తక్కువ. సంఘాలు సమ్మెలు చేసేవి. ఇప్పుడు జీతాలు పెరిగినయ్. బతుకులు మాదినయ్. మారిన జీతాలకు తగ్గట్టే మేడే. కూడా మారింది' అని చెబుతున్నడు. అప్పట్లో మేడే ఎర్ర జెండాల వాళ్లదే. కానీ ఇప్పుడు అన్ని సంఘాలూ మేడేలు చేస్తున్నయ్. 'కొత్త సంఘాల రాకతో ఇప్పుడు జెండాలకు అగరబత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసే సంప్రదాయాలు వచ్చాయి. లీడర్లకు సన్మానాలు చేయడం, శాలువాలు కప్పడం కూడా మేడేలో చేరింది. పార్టీల లీడర్లు కార్మికులకు దగ్గర కావడానికి సంఘాలు నడుపుతున్నారు. వాళ్ళు మేడేకి స్వీట్లు పంచి పెడుతున్నారు. మేడేని ఒక పండుగలా మార్చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దగ్గరకొస్తున్నయ్. ఈ మేడే జోరుగుంటది' అని సదానంద్ అంటున్నరు. మేడే ఈ మధ్య కాలంలో పండుగలా మారింది.

సరే పండుగంటే విందు, వినోదాలే కదా? అవెట్లున్నయంటే? బొగ్గుబాయిల కాడ భలే విందు చేసుకుంటున్నామని సింగరేణిలో కార్మికులు అంటున్నారు. పొద్దున బొగ్గు బాయిల కాడ జెండా ఎగరేసిన తర్వాత. కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా దావత్ చేసుకుంటరట. ఇదెవని ఇంట్లో పేరంటం కాదు, ముందు పిలిచే ముచ్చటే లేదంటున్నడు సింగరేణిలో ఈసీ ఆపరేటర్ పనిచేస్తున్న రవీందర్. జెండా ఎగరేసిన తర్వాత దోస్తులంతా కలిసి మాట్లాడుకుని దావత్కు రెడీ అవుతమని చెబుతున్నడు. ఈ సంప్రదాయం బొగ్గుబాయిల కాడనే కాదు. నగరాల్లోని కార్ఖానాలకూ విస్తరించింది. లేబర్ హాలిడేని సంతోషంగా జరుపుకోవాలని కార్మికులు అనుకుంటున్నరు. ఎర్ర జెండా సంఘాలు కార్మికుల ప్రాణ త్యాగానికి గుర్తు ఈ పండుగ కాదంటుంటే కార్మికులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగ చేసుకుంటే తప్పేమీ లేదని కొంత మంది కార్మికులంటున్నారు. 

కంప్యూటర్ కార్మికులు

 జెండా వందనమో, జెండా పండుగో... ఏదో. ఒకటి జరుపుకుంటున్నారు. కానీ చాలా రంగాల్లో ఉద్యోగులు ఈ మేదేతో మనకు సంబంధం లేదనే అనుకుంటున్నారు. మేడే అంటే లేబర్ డే. 'లేబర్ అంటే ఎండలో పనిచేస్తూ.. చెమటలు భరిస్తూ... బరువులు మోసే ఉద్యోగమని ఏసీల్లో కూర్చుని కంప్యూటర్లతో పనిచేసే ఉద్యోగులనుకుంటున్నారు. తాము లేబర్ కాదని చాలా మంది ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లోని ఉద్యోగులనుకుంటారు. 'లేబర్'' పదాన్ని ఏదో తిట్టుగా భావిస్తారు. ఎక్కువ జీతం, అన్ని సౌకర్యాలుంటే లేబర్ కాదనే అపోహలో ఉండటానికి మరో కారణం అంటోంది ఎల్అండ్ టీ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన విశాలారెడ్డి. సమస్యలు తక్కువగా ఉండటం, ఈ రంగాల్లో కార్మిక సంఘాలకు అనుమతి లేకపోవడం. మరో కారణమని ఆమె అంటోంది. 
 

వాళ్ల భయం అదే!

'ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటున్నామని చెప్పే కంపెనీలు దసరా, దీపావళి, రంజాన్, జనవరి ఫస్ట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తాయి. కానీ వాళ్లకు సంబంధించిన రోజుని మాత్రం జరపవు. జరుపుకోడానికి అనుమతించవు. దీనికి కారణం.. మాకు మా లాభాలే ముఖ్యం. మేడేని ఎంటర్టైన్ చేస్తే మేనేజ్ మెంట్కు లాభం ఉండదు అందుకే అనుమతించట్లేదని, ఉద్యోగులు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకుంటే ఉద్యోగం పోతుందనే అభద్రతా భావంతో ఉంటారు. దాంతో వేడుకలు చేసేందుకు ముందుకు రారు'. అని లాజిక్ డిజైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రాజు కంచిభొట్ల చెప్పారు. 'ఐటీ ఉద్యోగులు తమకు ఒక లేబర్ యూనియన్ ఉండాలని కోరుకోరు. కానీ ఉద్యోగం తీసేస్తేమాత్రం లేబర్ ఆఫీసుకు పోతారు. వాళ్లకు తాము లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తామని అప్పుడు. తెలుస్తుంద'ని ఆయన అన్నారు. ఇక్కడ మేడే జరుపుకోకపోవడానికి రెండు వైపులా కారణాలున్నాయనేది ఆయన అభిప్రాయం.