
ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని విశాల్ మెగా మార్ట్ దుకాణంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో విశాల్ మెగా మార్ట్ షోరూమ్‌లో లిఫ్ట్ లో ఉన్న కుమార్ ధీరేంద్ర ప్రతాప్ అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం (జూలై5) పోలీసులు, అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన బృందాలు సంయుక్తంగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ధీరేంద్ర ప్రతాప్ మృతదేహాన్ని గుర్తించారు.
శుక్రవారం సాయంత్రం 6.44 గంటల ప్రాంతంలో పదమ్ సింగ్ రోడ్డులోని నాలుగు అంతస్తుల భవనంలోని విశాల్ మెగా మార్ట్ అవుట్‌లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఇందులో కిరాణా ,ఫాబ్రిక్ వస్తువులు ఉండటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి.ఆ ప్రాంతల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పడానికి శ్రమించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో గందరగోళం ,భయాందోళనలు చెలరేగాయి.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. కరోల్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మంటలను ఇంకా అదుపులోకి రాకపోవడంతో స్థానికులు, వ్యాపార యజమానులు భయాందోళనకు గురవుతున్నారు.