ఇంట్లో క్రీస్తు ఫోటోలు, సిలువ ఉన్నంత మాత్రాన మతం మారినట్లు కాదు: బాంబే హైకోర్టు తీర్పు

ఇంట్లో క్రీస్తు ఫోటోలు, సిలువ ఉన్నంత మాత్రాన మతం మారినట్లు కాదు: బాంబే హైకోర్టు తీర్పు

ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో క్రైస్తవ మత చిహ్నాలు లేదా ఏసుక్రీస్తు చిత్రపటాలు ఉన్నంత మాత్రాన.. ఆ వ్యక్తి హిందుత్వాన్ని వదిలేసి క్రైస్తవ మతంలోకి మారిపోయారని భావించలేమని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. మత మార్పిడి అనేది కేవలం ఇంట్లోని చిహ్నాలు, గుర్తుల ఆధారంగా నిర్ధారించే అంశం కాదని, దానికి పక్కా ఆధారాలు ఉండాలని జస్టిస్ ముకుళికా జవాల్కర్, జస్టిస్ నందేష్ దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అకోలాకు చెందిన ఒక విద్యార్థి తనకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్స్ చేసింది. సదరు విద్యార్థి పూర్వీకులు క్రైస్తవ మతంలోకి మారారని, అందుకే అతనికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేమని కుల నిర్ధారణ కమిటీ గతంలో పేర్కొంది. ఆ విద్యార్థి ఇంట్లో సిలువ గుర్తు, ఏసు క్రీస్తు చిత్రపటాలు ఉండటాన్ని, అలాగే 1962 నాటి పాత పాఠశాల రికార్డుల్లో క్రిస్టియన్ అని ఉండటాన్ని అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలుగా కోర్టుకు చూపారు.

అయితే.. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మత మార్పిడి జరిగిందని చెప్పాలంటే.. బాప్టిజం తీసుకున్నట్లు అధికారిక పత్రాలు లేదా బాప్టిజం సర్టిఫికేట్ వంటి బలమైన సాక్ష్యాలు చూపాలని ధర్మాసనం అధికారులకు పేర్కొంది. కేవలం చిహ్నాల ఆధారంగా ఒకరి మతాన్ని నిర్ణయించడం సరికాదని వెల్లడించింది. అణచివేత, వివక్ష నుంచి తప్పించుకోవడానికి గతంలో కొందరు పాఠశాల రికార్డుల్లో అలా రాయించుకుని ఉండవచ్చని, కానీ అది అధికారిక మత మార్పిడి కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది.

ALSO READ : షిప్పింగ్ కంపెనీలకు అమెరికా గ్యారెంటీ.. 

విద్యార్థి సమర్పించిన ఇతర ప్రభుత్వ పత్రాలు, స్కూల్ రికార్డులతో పాటుగా సదరు వ్యక్తి బంధువులకు ఇప్పటికే ఉన్న కుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించిన హైకోర్టు.. అధికారుల నిర్ణయం తప్పు అని తేల్చింది. వెంటనే ఆ విద్యార్థికి ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. సామాజిక గుర్తింపు, మతపరమైన ఆచారాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ తీర్పు స్పష్టంగా వివరించిందని న్యాయ నిపుణులు అంటున్నారు.