మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే వారికి సెబీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్వెస్ట్మెంట్లకు భద్రత కల్పించేలా 'వాలంటరీ లాక్-ఇన్' లేదా 'డెబిట్ ఫ్రీజ్' అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు ఇంట్లో ఉన్న నగలను సేఫ్టీ కోసం లాకర్‌లో పెట్టి తాళం వేసినట్లుగానే.. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లను కూడా తాళం వేసి భద్రపరుచుకోవచ్చు డిజిటల్‌గా. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఫండ్స్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం కానీ, వేరే ఫండ్లకు ట్రాన్స్ఫర్ చేయటం కానీ అస్సలు కుదరదు.
ప్రస్తుతం అంతా డిజిటలైజేషన్ అయిపోయినందున.. ఫోన్లలోని యాప్స్ ద్వారానే మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు సులభంగా జరిగిపోతున్నాయి. ఈ సౌలభ్యం ఎంత బాగుందో.. సైబర్ మోసాల భయం కూడా అంతే పెరుగుతోంది. ఎవరైనా మీ అకౌంట్‌ను హ్యాక్ చేసినా లేదా అనధికారికంగా లావాదేవీలు జరపాలని చూసినా.. సెబీ తీసుకొచ్చిన 'లాకింగ్' ఫీచర్ వారి ప్రయత్నాలను తిప్పికొడుతుంది. మీరు ఒకసారి మీ ఫోలియోను ఫ్రీజ్ చేస్తే.. మీరు మళ్లీ దాన్ని అన్‌లాక్ చేసే వరకు ఎటువంటి లావాదేవీలు జరగవు. ఇది డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారికే కాకుండా.. నేరుగా ఫండ్ హౌస్‌లలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది సెబీ.
మ్యూచువల్ ఫండ్స్ లాకింగ్ ఫీచర్ వాడటం చాలా ఈజీ. దీనికోసం 'MF సెంట్రల్' అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పెట్టుబడిదారులు తమ ఫండ్లను లాక్, అన్‌లాక్ చేస్కోవచ్చు. అయితే దీనికోసం మీ ఫోలియో ఖచ్చితంగా KYC పూర్తి చేసి ఉండాలి. అలాగే మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు లాక్ వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు అథెంటికేషన్ కోసం వీటికి మెసేజ్‌లు వస్తాయి. ఏప్రిల్ 30 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చేస్తోంది.
మన దేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఇప్పుడు రూ.80 లక్షల కోట్లు దాటేశాయి. లక్షలాది మంది సామాన్యులు SIPల రూపంలో డబ్బులు దాచుకుంటున్నారు. ఇంతటి భారీ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కాపాడటానికే సెబీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటానికి ఈ 'డిజిటల్ లాక్' ఇన్వెస్టర్లకు ఒక వజ్రాయుధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అవగాహన కలిగి ఉండాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
