
ఏటూరునాగారం, వెలుగు: గోదావరి నీటిమట్టం పెరుగుతోందని, పరివాహక ప్రజలతోపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్. సూచించారు. శుక్రవారం ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్వద్ద కరకట్టను, వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా ఇండ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినన్ని ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
అనంతరం చిన్నబోయినపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించి, మెనూ పాటించాలని సిబ్బందికి చెప్పారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని టీచర్లకు సూచించారు. ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్, తహసీల్దార్ జగదీశ్, ఏటీడీవో క్షేత్రయ్య, ఎంపీడీవో కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పొదుమూరులో పర్యటన
మంగపేట, వెలుగు: మండల కేంద్రంలోని ముంపు ప్రభావిత ప్రాంతమైన పొదుమూరులో కలెక్టర్దివాకర టీఎస్ శుక్రవారం పర్యటించారు. గోదావరి నదికి వరద పెరుగుతోందని, మంగపేట మండలంలోని లోతట్టు ప్రాంతాలను ముంచేత్తే ప్రమాదం ఉన్నందున అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్, ఎంపీడీవో భద్రు, పంచాయతీ కార్యదర్శి సురేశ్తదితరులున్నారు.