వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంత చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇటీవల 'విష్ణు విన్యాసం' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో అలరించారు. ఇప్పుడు రూట్ మార్చిన ఆయన పూర్తిస్థాయి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మార్చి 6, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్..
లేటెస్ట్ గా ఈమూవీ ట్రైలర్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత సన్నీ గున్నం గురించి తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. "సన్నీ నా జీవితంలో 18 ఏళ్లుగా అత్యంత సన్నిహితుడు. వాళ్ల నాన్నగారు గున్నం గంగరాజు గారి లాగే, సన్నీకి కూడా వైవిధ్యమైన కథలను గుర్తించే అద్భుతమైన అభిరుచి ఉంది. తన తొలి ప్రయత్నంగా 'మృత్యుంజయ'ను నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉంది" అంటూ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
మిస్టరీ వెనుక మనిషి!
ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్సివ్‌గా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఇందులో శ్రీ విష్ణు 'క్రైమ్ బ్యూరో'లో చేరాలని ప్రయత్నించే యువకుడిగా కనిపిస్తారు. అయితే అనుభవం లేదన్న కారణంతో అధికారులు అతడిని తిరస్కరిస్తారు. సిస్టమ్ మద్దతు లేకపోయినా, తనదైన శైలిలో ఒక సంక్లిష్టమైన మిస్టరీని ఛేదించేందుకు అతను సిద్ధమవుతాడు. ట్రైలర్‌లో కనిపించిన చిన్న పిల్లల పాత్రలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. అసలు ఆ పిల్లలకు, హీరోకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. సుకుమార్ అసోసియేట్ అయిన హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న దర్శకుడు కావడంతో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి..
తారాగణం
ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా జాన్ కీలక పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీతో పాటు, ఆమె పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతం సినిమాకు ప్రధాన బలం. లైట్ బాక్స్ మీడియా , పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీ విష్ణు మాస్ ఇమేజ్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎలా మెప్పిస్తారో మనందరికీ తెలిసిందే. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్‌తో ఆయన మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాలంటే మార్చి 6 వరకు వేచి చూడాల్సిందే!
