
Income Tax Refund: త్వరలోనే ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయటానికి గడువు దగ్గర పడుతోంది. వాస్తవానికి జూలై 31తో గడువు ముగియాల్సి ఉండగా దానిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు పన్ను శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఏఐ టూల్స్, టెక్నాలజీని వినియోగించి పన్ను ఫైలింగ్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తోంది.
ఈ ఏడాది మార్చి నాటికి 75 లక్షల ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలైదే ఇప్పటి వరకు 71 లక్షలకు పైగా రిటర్న్స్ వెరిఫికేషన్ పూర్తయిందని ఐటీ శాఖ అధికారిక వెబ్ సైట్ ప్రకారం తేలింది. అయితే ఈ ఏడాది పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వ్యక్తులు వాటి ప్రాసెసింగ్ అలాగే టాక్స్ రిఫండ్స్ పొందటంలో కొంత ఆలస్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడైంది. ఎందుకంటే పన్ను అధికారులు వ్యక్తుల రిటర్న్స్ అసెస్ చేయటంతో పాటు వారికి సంబంధించిన పాత సంవత్సరాల రిటర్న్స్ కూడా నిశితంగా పరిశీలించాకే రీఫండ్స్ ప్రాసెస్ చేయవచ్చని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.
దీనికి తోడు ఈ ఏడాది పన్ను రిటర్న్స్ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఫైలింగ్ ఆలస్యంగా మెుదలైంది. దాదాపు నెల ఆలస్యం కూడా ప్రాసెసింగ్ ఆలస్యాలకు కారణంగా మారవచ్చని తెలుస్తోంది. చాలా మంది గతంలో మాదిరిగా సులువుగా రీఫండ్స్ పొందటం కష్టం అనే విషయాన్ని గమనించి ఫైలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ వారిలో లక్షల మంది రీఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు డేటా చెబుతోంది.
ALSO READ : సెబీ నిషేధంపై స్పందించిన జేన్ స్ట్రీట్.. కుంభకోణంపై రియాక్షన్ ఏంటంటే?
ముందుగా పాత సంవత్సరాలకు చెందిన రిటర్న్స్ పరిశీలించటం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనే విషయం నిర్థారించుకున్నాకే రీఫండ్స్ ప్రాసెసింగ్ చేయటం జరుగుతోందని వెల్లడైంది. ఈ క్రమంలో ఏదైనా విషయాలపై అనుమానం కలిగినా లేక వివరణ అవసరం అయినా అందుకోసం సదరు పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపించేందుకు పన్ను అధికారులు సిద్ధంగా ఉన్నారు. వారి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేసిన తర్వాత, పెండింగ్ కేసుల పూర్తితోనే రీఫండ్స్ వస్తాయని టాక్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.
అయితే దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిజాయితీగా రిటర్న్స్ ఫైల్ చేస్తే కొంత ఆలస్యం అయినప్పటికీ ఎలాంటి సమస్యలూ లేకుండానే అసెస్మెంట్, రీఫండ్స్ పూర్తవుతాయని తెలుస్తోంది. అందుకే 2025-26 అసెస్మెంట్ సంవత్సరంలో ఆలస్యాలపై కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.