
Jane Street Ban: భారత స్టాక్ మార్కెట్లలో జేన్ స్ట్రీట్ అనే అమెరికాకు చెందిన పెట్టుబడి సంస్థ అక్రమ ట్రేడింగ్ పద్ధతుల ద్వారా వేల కోట్లు లాభపడినట్లు వచ్చిన వార్తలో ప్రముఖ పెట్టుబడి సంస్థ నువామా షేర్లు కూడా 7 శాతం మేర కుప్పకూలాయి. పైగా పెట్టుబడిదారుల్లో కూడా భారీగా ఆందోళనలు పెరిగాయి. జేన్ స్ట్రీట్ సంస్థకు చెందిన 4 అనుబంధ సంస్థలను భారత ఈక్విటీ మార్కెట్లలో ఎలాంటి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలను నిర్వహించకుండా మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చర్యలు చేపట్టడంతో ఈ మహా కుంభకోణం వార్తల్లో ప్రధానాంశంగా మారింది.
దీనిపై అమెరికా ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ అధికారికంగా స్పందించింది. తమపై సెబీ నిషేధాన్ని విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను అందించిందని, తాము రెగ్యులేటరీ సంస్థతో దీనిపై సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది. అయితే సెబీ తన ప్రాథమిక దర్యాప్తులో జేన్ స్ట్రీట్ అక్రమం ట్రేడింగ్ పద్ధతుల ద్వారా స్టాక్ మార్కెట్లను మ్యానిపులేట్ చేసిందని, తమ ట్రేడింగ్ పొజిషన్లు సూచీల దిశ, గమనాన్ని మార్చటం ద్వారా భారీగా జేన్ స్ట్రీట్ లాభాలను ఆర్జించిందంటూ బ్యాన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
దర్యాప్తుపై సెబీ ఇచ్చి చివరి తీర్పు ప్రకటన వెలువడే వరకు ప్రస్తుతం జేన్ స్ట్రీట్ సంస్థపై ప్రకటించిన తీర్పు అమలులోనే ఉంటుందని తెలుస్తోంది. సెబీ మధ్యంతర ఉత్తర్వు ఫలితాలతో తాము విభేదిస్తున్నారమని, దీనిపై సెబీతో మరింతగా సంప్రదింపులు జరుపుతామని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా తాము ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రతి చోట అక్కడి నిబంధనలకు అనుగుణంగానే పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు జేన్ స్ట్రీట్ చెప్పింది.
ప్రస్తుతం సెబీ జేన్ స్ట్రీట్ సంస్థ నుంచి రూ.4వేల 840 కోట్లు జప్తుకు చర్యలు కొనసాగుతున్నాయి. జేన్ స్ట్రీట్ చట్టవిరుద్ధమైన లాభాలను తన తప్పుడు ట్రేడింగ్ విధానాల ద్వారా ఆర్జించిందని సెబీ ప్రధానంగా ఆరోపిస్తున్నందున ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో ఆ డబ్బును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలాగే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్యాన్ ఉన్నన్ని రోజులు ఎలాంటి ట్రేడింగ్ కార్యకాలాపాలకు పాల్పడకూడదని సెబీ తన నోటీసుల్లో పేర్కొంది.
జేన్ స్ట్రీట్ సంస్థ పెద్ద సంఖ్యలో డెరివేటివ్ పొజిషన్ల ద్వారా బ్యాంక్ నిఫ్టీ సూచీలను తారుమారు చేయగలిగిందని సెబీ తన 105 పేజీల రిపోర్టులో పేర్కొంది. ఇండెక్స్ ఆప్షన్స్ మార్కెట్‌ను తారుమారు చేయడానికి వీలుగా, అధిక రిటైల్ పెట్టుబడిదారులు ఉన్న అనేక లిక్విడ్ స్టాక్‌లను జేన్ స్ట్రీట్ ఉపయోగించటం ఒక అసాధారణమైన ప్లాన్ అని సెబీ వెల్లడించింది. ఈ స్ట్రాటజీ కారణంగా మార్కెట్లలో ట్రేడింగ్ చేసే ఇతర ఇన్వెస్టర్లు, రిటైల్ పెట్టుబడిదారులు నష్టపోతారని, మానిప్యులేటర్లు లాభపడతారని సెబీ చెప్పింది.
మెుత్తానికి జనవరి 2023 నుంచి మార్చి 2025 మధ్య కాలంలో జేన్ స్ట్రీట్ భారత కార్యకలాపాల ద్వారా రూ.36వేల 500 కోట్లు లాభాలను పొందినట్లు సెబీ పేర్కొంది. వాస్తవానికి భారత స్టాక్ మార్కెట్లలో నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలు క్యాష్ మార్కెట్లో ఇంట్రాడే పొజిషన్లు తీసుకోకూడదు. అందుకే జేన్ స్ట్రీట్ దీని చుట్టూ ఉన్న ఇతర అవకాశాలను ఉపయోగించుకుని మార్కెట్లను మ్యానిపులేట్ చేయగలిగిందని సెబీ వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తాము నిబంధనలను పాటిస్తామంటూ జేన్ స్ట్రీట్ ఫిబ్రవరి 2025న ఎన్ఎస్ఈకి వాగ్ధానం కూడా చేసింది. కానీ ఆచరణలో మాత్రం వాటిని పాటించలేదని మార్కెట్ రెగ్యులేటర్ గుర్తించింది.