ఒకే తరహాలో తండ్రికొడుకుల హత్య: బీహార్‎లో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్య

ఒకే తరహాలో తండ్రికొడుకుల హత్య: బీహార్‎లో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్య

పాట్నా: బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆయనను కాల్చి చంపారు. శుక్రవారం (జూలై 4) రాత్రి గాంధీ మైదాన్ ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్ దగ్గర కారు దిగగానే దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా 6 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో హత్యకు గురికావడం గమనార్హం. గుర్తు తెలియని దుండగులు గుంజన్ ఖేమ్కాను కూడా బైకుపై వచ్చి కాల్చి చంపారు. 

ఈ ఘటనపై గోపాల్ ఖేమ్కా సోదరుడు శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. కాల్పులు జరిగిన దాదాపు మూడు గంటల తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆరోపించారు. తన సోదరుడు శుక్రవారం రాత్రి బంకిపూర్ క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా 11:40 గంటల సమయంలో హోటల్ పనాస్ సమీపంలో ఉన్న తన అపార్ట్‌మెంట్ దగ్గర బైకులపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించే లోపే మరణించారని చెప్పారు. 11:40 గంటలకు కాల్పులు జరిగితే తెల్లవారుజామున 2:30 గంటల వరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోలేదని ఆరోపించారు. 

ఈ ఏడాది  బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సానుభూతిపరుడు, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఈ ఘటనపై ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఇదేనా అని  ప్రశ్నించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు పప్పు యాదవ్.

►ALSO READ | ఢిల్లీ విశాల్ మెగా మార్ట్లో అగ్ని ప్రమాదం..లిఫ్ట్లో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఈ ఘటనపై పాట్నా సీనియర్ పోలీసు అధికారి దీక్షా కుమారి మాట్లాడుతూ.. ‘‘జూలై 4 రాత్రి 11 గంటల ప్రాంతంలో గాంధీ మైదాన్ దక్షిణ ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా కాల్చి చంపబడ్డారని సమాచారం అందింది. తమ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఘటన స్థలం నుంచి ఒక బుల్లెట్, ఒక షెల్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరు హత్య చేశారు..? ఎందుకు చేశారు..? అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. నిందితులను గుర్తించేందుకు ఘటన స్థలంలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.