ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగుల కోసం ఆఫీస్ వర్క్ విధానంలో కీలక మార్పులు చేస్తోంది. ఇకపై ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వారానికి కనీసం నాలుగు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కంపెనీ ఆదేశించింది. దీనికి సంబంధించి హెచ్‌ఆర్ (HR) విభాగం ఉద్యోగులకు ఈమెయిల్ కూడా పంపింది. గతంలో కేవలం సీనియర్ మేనేజర్లు, డైరెక్టర్లకే (లెవల్ 7 అంతకంటే ఎక్కువ) ఈ నిబంధన ఉండేది. ఇప్పుడు దీనిని 6A లెవల్ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. అంటే మరికొంత మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు కూడా ఆఫీసుకు రాక తప్పదు. మనం ఉదాహరణగా నిలిస్తేనే, మన కింద పని చేసే బృందం కూడా ఆఫీసుకు వస్తుంది అని మేనేజర్లకు కంపెనీ గుర్తుచేసింది. ఉద్యోగులు నెలకు ఎన్ని రోజులు ఆఫీసుకు వస్తున్నారనే డేటాను హెచ్‌ఆర్ ప్రతి నెలా పరిశీలిస్తుంది. నెలకు 10 రోజులు రావాలనే నిబంధనను కొందరు పాటించడం లేదని కంపెనీ హెచ్చరించింది.
ఎందుకు ఈ మార్పు అంటే :
ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్ అనుసరిస్తున్నప్పటికీ, టీమ్ సభ్యుల మధ్య సమన్వయం, కొత్త విషయాలు నేర్చుకోవడం, పని వేగం పెరగాలంటే ఆఫీసులో ఉండటం అవసరమని భావిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, మిగిలిన ఐటీ దిగ్గజాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. TCS వారానికి 5 రోజులు ఆఫీస్ రావాలని ఇప్పటికే నిబంధన పెట్టింది. హాజరును బట్టి జీతంలో ఎక్స్ట్రా అలవెన్సులు ఇస్తోంది. విప్రో కూడా వారానికి 3 రోజులు ఆఫీసులో ఉండాలని, అదికూడా రోజుకు కనీసం 6 గంటలు గడపాలని ఆదేశించింది.
నిపుణుల అభిప్రాయం:
ప్రస్తుతం కంపెనీలు AI (కృత్రిమ మేధస్సు), కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. దీనివల్ల టీమ్ సభ్యులు ఒకేచోట ఉండి పని చేస్తేనే ఫలితాలు బాగుంటాయని కంపెనీలు నమ్ముతున్నాయి. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పెరిగిన ఉత్పాదకతను ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఇప్పుడు సంస్థలకు ఒక సవాలుగా మారింది. మొత్తంగా ఇన్ఫోసిస్‌లో సీనియర్ స్థాయి ఉద్యోగులు కూడా ఇకపై వారంలో ఎక్కువ రోజులు ఆఫీసులోనే గడపాల్సి ఉంటుంది.
