లింగంపల్లి, చందానగర్ లో నాలా ఆక్రమణలు కూల్చివేత : హ్యాట్సాప్ హైడ్రా అంటున్న స్థానికులు

లింగంపల్లి, చందానగర్ లో నాలా ఆక్రమణలు కూల్చివేత : హ్యాట్సాప్ హైడ్రా అంటున్న స్థానికులు

చినుకు పడితే చాలు చిత్తడి.. కొంచెం వర్షం పడితే చాలు రోడ్లపై నీళ్లు.. భారీ వర్షం పడితే చాలు వరదలు.. హైదరాబాద్ సిటీలో దీనికి కారణం ఏంటో తెలుసా.. నీళ్లు పోవాల్సిన నాలాలు ఆక్రమణకు గురి కావటం.. అవును.. సిటీలో ఉన్న ఎన్నో నాలాలు ఆక్రమణలకు గురవ్వటంతో నీళ్లు వెళ్లే మార్గం లేక.. వర్షం వచ్చినప్పుడు రోడ్లపై ప్రవహిస్తున్నాయి నీళ్లు.. ఈ క్రమంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలతో స్థానికులు శెభాష్ అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని లింగంపల్లి, చందానగర్ ఏరియాలో పెద్ద పెద్ద నాలాలు ఉన్నాయి.. ఇవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి.. ఈ క్రమంలోనే హైడ్రా రంగంలోకి దిగింది.

2025, జూలై 4వ తేదీ ఉదయం నుంచి లింగంపల్లి నుంచి చందానగర్ వరకు ఉన్న పెద్ద నాలాను పరిశీలించిన హైడ్రా అధికారులు.. ఎక్కువ శాతం ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా టీమ్స్.. ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. కొందరు అయితే ఏకంగా నాలా చుట్టూ ఫెన్సింగ్ వేశారు.. వాటిని పీకిపాడేస్తున్నారు. కొందరు అయితే నాలాను ఆక్రమించి షాపులు కట్టారు.. మరికొందరు ఇళ్లను కట్టారు.. వీటన్నింటినీ పెద్ద పెద్ద జేసీబీ సాయంతో కూల్చివేస్తున్నారు. 

Also Read : దొడ్డి కొమురయ్యకు మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి

లింగంపల్లి, చందానగర్ ఏరియాల్లో నాలాలను ఆక్రమించి.. నాలాలను పూడ్చివేసి మరీ నిర్మాణాలు చేపటంతో.. నీళ్లు వెళ్లే మార్గం లేక.. భారీ వర్షం వచ్చినప్పుడు నీళ్లన్నీ రోడ్ల పక్కన ఉన్న ఇళ్లను, షాపులను ముంచెత్తుతుంది. ప్రస్తుతం లింగంపల్లి, చందానగర్ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు, నాలాల పునరుద్ధరణకు చర్యలు చూసిన స్థానికులు.. శెభాష్ హైడ్రా అంటున్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగింపుతో మా ప్రాంతంలో ముంపు సమస్య పరిష్కారం అవుతుందని.. నీళ్లు వెళ్లే మార్గం ఏర్పడుతుంది అంటున్నారు. లింగంపల్లి నుంచి చందానగర్ వరకు ఉన్న నాలా వెడల్పు 16 మీటర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 7, 8 మీటర్లకు పరిమితం అయ్యింది. సగం నాలా ఆక్రమణకు గురైంది.. భారీ యంత్రాలతో వీటిని తొలగిస్తుండటంతో.. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.