ఇరాన్‎పై మరో నాలుగైదు వారాలు యుద్ధం కంటిన్యూ: ట్రంప్ కీలక ప్రకటన

ఇరాన్‎పై మరో నాలుగైదు వారాలు యుద్ధం కంటిన్యూ: ట్రంప్ కీలక ప్రకటన

వాషింగ్టన్: యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‏పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతోందని.. ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తేల్చి చెప్పారు. యుద్ధం మరో నాలుగైదు వారాల పాటు జరుగుతోందని స్పష్టం చేశారు. 

‘‘ఇరాన్‎తో అమెరికాకు ముప్పు ఉంది.. అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు.. మా హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోం. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేయగల మిస్సైల్స్ ఉన్నాయి.. వాళ్ల మిస్సైల్ వ్యవస్థను నాశనం చేయడమే మా లక్ష్యం” అని ట్రంప్ పేర్కొన్నారు. 

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‎లోని వందల లక్ష్యాలపై దాడులు చేశామని.. ఆ దేశ మిలిటరీ ఉన్నతాధికారులు చాలా వరకు చనిపోయారని తెలిపారు. ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‎పై దాడులు చేశామని.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడి చేశామని చెప్పారు. ఇరాన్‎కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు.