పాలిటెక్నిక్ ల్యాటరల్ ఎంట్రీ బంద్..డిప్లొమా ఇక ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమానం: సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు 

పాలిటెక్నిక్ ల్యాటరల్ ఎంట్రీ బంద్..డిప్లొమా ఇక ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమానం: సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు 
  • టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు రద్దయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • బీటెక్ సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డైరెక్ట్ అడ్మిషన్లు ఇవ్వొద్దు.. 
  • ఫస్టియర్ నుంచి చదవాల్సిందే 
  • వీసీల పదవీకాలం ఐదేండ్లకు పెంచాలి
  • వర్సిటీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లలో అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలి
  • ఇకపై గెస్ట్, కాంట్రాక్ట్ నియామకాలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక సంస్కరణకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు చేసింది. ప్రధానంగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే ల్యాటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు ఐటీఐలన్నీ కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లాలని ప్రతిపాదించింది. 

విద్యారంగంలో తీసుకోవాల్సిన సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డికి 3 రోజులక్రితం కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక అందించారు. ఇందులో కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా ఇంజినీరింగ్ (బీటెక్) సెకండియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఆ విధానాన్ని రద్దు చేయాలని  కమిషన్ సూచించింది. 

పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా ఇంటర్ విద్యార్థులతో సమానంగా పరిగణించి, బీటెక్ ఫస్టియర్‌‌‌‌లోనే వారికి అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అది కూడా ఎంట్రెన్స్ ద్వారా వచ్చిన వారికే అవకాశం ఇవ్వాలని సూచించింది. అయితే, లాటరల్ ఎంట్రీతో పాలిటెక్నిక్ కాలేజీలు కేవలం ఇంజినీరింగ్‌‌‌‌కు పంపించే ఫీడర్ సంస్థలుగా మారిపోయాయని కమిషన్ అభిప్రాయపడింది. దీనివల్ల  పాలిటెక్నిక్ అసలు ఉద్దేశం దెబ్బతింటున్నదని పేర్కొన్నది.  

టెన్త్ పాసైతేనే ఐటీఐ సీటు 

ఐటీఐలో చేరాలంటే కనీస అర్హత పదో తరగతి ఉండాలని కమిషన్ సూచించింది. అలాగే, రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్‌‌‌‌ ఐటీఐలకు పర్మిషన్లు ఇవ్వొద్దని, ప్రస్తుతమున్న సర్కారు ఐటీఐలను అప్‌‌‌‌గ్రేడ్ చేయాలని సిఫారసు చేసింది. ఐటీఐలను కార్మిక శాఖ నుంచి తప్పించి, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించింది. 

పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ కిందకు తీసుకురావాలని సూచించింది. దీంతోపాటు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్​బీటీఈటీ)ను  పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేదా రద్దు చేయాలని సూచించింది. మరోపక్క సర్కారు కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,586 పోస్టులను 2026 చివరి నాటికి భర్తీ చేయాలని తెలిపింది. 

3 నుంచి 5 ఏండ్లకు పెంచాలి..

ప్రస్తుతం రాష్ట్రంలో వీసీల పదవీకాలం 3 ఏండ్లుగా ఉన్నది. దీన్ని 5 ఏండ్లకు పెంచాలని కమిషన్ సిఫార్సు చేసింది. వీసీగా పనిచేసే వ్యక్తి గరిష్ట వయసు 70 ఏండ్లు మించకూడదు. 5 ఏండ్లు లేదా 70 ఏండ్లు.. ఏది ముందైతే అది వర్తించాలని సూచించింది. ఒకసారి వీసీగా చేసిన వ్యక్తికి.. మళ్లీ అదే వర్సిటీలో రెండోసారి అవకాశం ఇవ్వొద్దని, వేరే వర్సిటీలో మాత్రం నియమించవచ్చని పేర్కొన్నది. 

వీసీ పోస్టు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండొద్దని, ప్రస్తుతం ఉన్న వీసీ దిగిపోవడానికి 6 నెలల ముందే కొత్త వీసీ ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది. వర్సిటీల్లో కీలక పోస్టులైన రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌‌‌‌లాంటి కీలక పోస్టులను ఇష్టారాజ్యంగా కాకుండా.. పారదర్శకమైన ఎంపిక విధానం ద్వారానే భర్తీ చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. 

కాంట్రాక్టు లెక్చరర్లను అబ్జార్బ్ చేయాలి..

వర్సిటీల్లో ఏండ్లనుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీపై కమిషన్ కీలక ప్రతిపాదన చేసింది. అర్హత ఉన్న కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే రెగ్యులర్ ఫ్యాకల్టీగా అబ్జార్బ్  చేసుకోవాలని సూచించింది. ఇకపై భవిష్యత్తులో వర్సిటీల్లో గెస్ట్, కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ పద్ధతిలో నియామకాలు చేపట్టొద్దని, రెగ్యులర్ రిక్రూట్‌‌‌‌మెంట్ మాత్రమే ఉండాలని ప్రపోజ్ చేసింది. 

ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని, వీసీలకు నియామకపు అధికారాలు కట్టబెట్టాలని సూచించింది. వీసీల ఎంపిక పారదర్శకంగా జరిగేందుకు సెర్చ్ కమిటీలో సర్కారు తరఫున రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ నామినీగా ఉండాలని, ముగ్గురు రిటైర్డ్ వీసీలు సభ్యులుగా ఉండాలని,  ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కచ్చితంగా స్థానం కల్పించాలని ప్రతిపాదించింది.