
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది. వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లపై టోల్ ఛార్జీలను దాదాపు 50 శాతం వరకుతగ్గించింది. టోల్ ఛార్జీల లెక్క తేలిన తర్వాత తగ్గించిన టోల్ ఛార్జీలు అమలులోకి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరించింది. ఈ సవరణలో వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ సెక్షన్లు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు గణనీయంగా తగ్గాయి. దాదాపు 50% వరకు తగ్గింపు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో వాహనదారులపై భారం తగ్గుతుంది. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు పెద్ద ఊరట.
కేంద్ర రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జాతీయ రహదారుల రుసుము (రేట్లు ,వసూలు నిర్ణయం) నియమాలు, 2008ని సవరించింది. టోల్ ఛార్జీలను లెక్కించేందుకు సవరించిన ఫార్ములాను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు జూలై 2, 2025న కేంద్ర రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో వాహనదారులకు ఉపశమనం కలిగించనుంది. అదే సమయంలో మౌలిక సదుపాయాల ఖర్చు రికవరీ,భరించగలిగే సామర్థ్యం మధ్య సమతుల్యతను కొనసాగిస్తుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు చెబుతున్నారు. ఈ సంస్కరణతో కీలక రహదారుల విస్తరణలలో మొత్తం ప్రయాణ ఖర్చును తగ్గిస్తుందని ,జాతీయ రహదారి నెట్‌వర్క్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.