టాటా సియెర్రా సరికొత్త రికార్డ్.. జస్ట్ 24 గంటల్లోనే 70వేల కార్ల బుకింగ్స్ నమోదు..!

టాటా సియెర్రా సరికొత్త రికార్డ్.. జస్ట్ 24 గంటల్లోనే 70వేల కార్ల బుకింగ్స్ నమోదు..!

టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ 'టాటా సియెర్రా'(Tata Sierra) సరికొత్త రూపంలో మళ్లీ భారత రోడ్లపైకి రావడానికి సిద్ధమైంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వస్తున్న ఈ కారు బుకింగ్స్ మొదలైన మొదటి రోజే సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 70వేల కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదు చేసి.. ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

టాటా సియెర్రా 90వ దశకంలోని వారికి ఒక ఎమోషన్. అప్పట్లోనే త్రీ-డోర్ డిజైన్, వెనుక వైపు పెద్ద గ్లాస్ విండోస్‌తో ఇది ఒక లగ్జరీ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు టాటాలు అదే వింటేజ్ లుక్‌ను ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కలిపి తీసుకురావడమే ఈ భారీ బుకింగ్స్‌కు ప్రధాన కారణంగా ఆటో నిపుణులు చెబుతున్నారు.

పాత సియెర్రా సిగ్నేచర్ స్టైల్ అయిన 'కర్వ్డ్ రియర్ గ్లాస్' విండోను ఇందులో కొనసాగించింది టాటా మోటార్స్. అయితే ఇది ఇప్పుడు మరింత ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తోంది. కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. ఇది లాంగ్ ట్రిప్స్ వేసే వారికి కూడా అనుకూలంగా ఉండనుంది. అల్ట్రా-మోడరన్ క్యాబిన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో టాటా మోటార్స్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీల విజయాల తర్వాత.. సియెర్రా ఈవీతో ప్రీమియం సెగ్మెంట్‌ను కూడా తన హస్తగతం చేసుకోవాలని టాటా ప్లాన్ చేస్తోంది. ఈ కారు ధర సుమారు రూ.25 లక్షల నుండి రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు మార్కెట్లోని మహీంద్రా, హ్యుందాయ్‌లకు గట్టి పోటీ ఇవ్వనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి సియెర్రా కేవలం ఒక కారు మాత్రమే కాదు.. అది ఒక లెగసీ. అందుకే పాత తరం వారితో పాటు టెక్నాలజీని ఇష్టపడే కొత్త తరం వారు కూడా దీనిపై మక్కువ చూపుతున్నారని ఆటో నిపుణులు అంటున్నారు. 

ఈ కార్ల డెలివరీని రాబోయే ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. భారీ డిమాండ్ దృష్ట్యా, వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు భారతీయ రోడ్లను శాసించిన సియెర్రా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ తిరిగి రావడం వాహన ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే భారీ బుక్కింగ్స్ కి కారణమైందని తెలుస్తోంది.