హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై వేధింపులకు తాళలేక ఆర్.ఎం.పి వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో మురహరి గౌడ్ అనే ఆర్.ఎం.పి వద్దకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేని రోగి వచ్చాడు. అల్వాల్లో గౌరవి అనే పేరుతో క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపి మురహరి గౌడ్ దగ్గర సదరు రోగి చికిత్స తీసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం మురహరి అతడిని మరొక ఆసుపత్రికి పంపడంతో అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆర్.ఎం.పి వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే సదరు వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు విచారణ జరుగుతున్న క్రమంలో ఆర్ఎంపి వైద్యుడు మురహరికి క్లినిక్ నడిపేందుకు సరైన పత్రాలు లేవని తేల్చారు. ఇదే ఆసరాగా చేసుకున్న అల్వాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి తనకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బంధువులు ఆరోపించారు. తనకు డబ్బులు ఇస్తే కేసు నమోదు చేయనని హామీ ఇవ్వడంతో ఐదు లక్షలకు బేరం కుదిరినట్లు బంధువులు చెప్పారు.
Also Read : రైళ్లలో లిమిట్కు మించి.. లగేజీ తీసుకెళితే డబ్బులు కట్టాల్సిందే.. ఎన్ని కేజీలు దాటితే..
అనంతరం.. లక్షా 50 వేల రూపాయలు ఎస్ఐ రాఘవేందర్ రెడ్డికి అందజేసినట్లు కుటుంబ సభ్యులకు ఆర్.ఎం.పి మురహరి గౌడ్ చెప్పినట్లు తెలిపారు. మిగిలిన డబ్బుల కోసం ఎస్సై వేధింపులు ఎక్కువ కావడంతో మెదక్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో ఆర్ఎంపి మురహరి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై డబ్బుల కోసం వేధింపులకు గురి చేయడం మూలంగానే మురహరి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.
