IPL 2026: 24 గంటల్లోనే కేకేఆర్‌కు మినీ షాక్: ఐపీఎల్‌ వేలంలో రూ.25.20 కోట్లు.. తర్వాత రోజే డకౌట్

IPL 2026: 24 గంటల్లోనే కేకేఆర్‌కు మినీ షాక్: ఐపీఎల్‌ వేలంలో రూ.25.20 కోట్లు.. తర్వాత రోజే డకౌట్

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు రికార్డ్ ధర దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను రూ. 25.20 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ మినీ వేలంలో ఇదే రికార్డ్ ధర కావడం విశేషం. రస్సెల్ లేకపోవడంతో కేకేఆర్ జట్టు గ్రీన్ తో ఆ లోటును భర్తీ చేసింది. మినీ ఆక్షన్ లో రూ.64 కోట్లతో బరిలోకి దిగి ఈ ఆసీస్ ఆల్ రౌండర్ కోసం దాదాపు 40 శాతం డబ్బును ఖర్చు చేశారు. గ్రీన్ రాకతో కేకేఆర్ జట్టు సంతోషంలో మునిగిపోయింది. అయితే ఈ ఆసీస్ వీరుడు మాత్రం మినీ వేలం ముగిసి ఒక రోజు కాకుండానే కేకేఆర్ కు చిన్న షాక్ ఇచ్చాడు.        

బుధవారం (డిసెంబర్ 17) ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ప్లేయింగ్ 11లో ఉన్న గ్రీన్ ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. రెండు బంతులాడి డకౌటయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన గ్రీన్.. ఆర్చర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ ఫ్లిక్ చేయగా.. కార్స్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో గ్రీన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. వేలం తర్వాత గ్రీన్ డకౌట్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క మ్యాచ్ తో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను తక్కువ చేయలేం. కాకపోతే వేలం తర్వాత డకౌట్ కావడం కేకేఆర్ ను కొంత షాక్ కు గురి చేసింది. 

గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి కేకేఆర్ ఈ ఆసీస్ పవర్ హిట్టర్ ను దక్కించుకుంది. ఈ మినీ ఆక్షన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.3 కోట్లతో వేలంలోకి అడుగుపెడుతుంది. మరోవైపు చెన్నై రూ.43.4 కోట్లతో బరిలోకి దిగింది. చెన్నై చివరి వరకు పోరాడినా కేకేఆర్ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను దక్కించుకుంది. ఆక్షన్ ముందు జడేజా సూపర్ కింగ్స్ జట్టు నుంచి రాజస్థాన్ కు వెళ్లిపోవడంతో గ్రీన్ పై చెన్నై కన్నేసింది. మరోవైపు కేకేఆర్ జట్టులో రస్సెల్ లేకపోవడంతో ఆ జట్టు ఫ్రాంచైజీ ఎలాగైనా గ్రీన్ ను దక్కించుకోవాలని చూసింది. అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు గ్రీన్ కోసం ఎంతకైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడలేదు. చివరకు కేకేఆర్ చెంతకు చేరాడు. 

గ్రీన్ ఐపీఎల్‎లో ఆర్సీబీ, ముంబై ఫ్రాంచైజీలు తరుఫున ప్రాతినిథ్యం వహించాడు. క్యాచ్ రిచ్ లీగులో ఇప్పటి వరకు 29 మ్యాచులు ఆడిన గ్రీన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 41.5 సగటుతో 707 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‎తో పాటు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్రీన్ వెన్నుముక గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్‎కు దూరమయ్యాడు. 2023, 2024 సీజన్ లలో కూడా గ్రీన్ కు 17.5 కోట్ల భారీ ధర పలకడం విశేషం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)