ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ దిగజారుతున్న వేళ.. సుప్రీంకోర్టు బుధవారం అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో టోల్ వసూళ్లను నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం ముఖ్యం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఢిల్లీ చుట్టూ ఉన్న 9 టోల్ ప్లాజాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడానికి అవకాశాలను పరిశీలించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోపు నిర్ణయం తీసుకుని రికార్డులో ఉంచాలని కోర్టు కోరింది.
ఢిల్లీ సరిహద్దుల్లో వాహనాల రద్దీని తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టేందుకు టోల్ ప్లాజాలను తాత్కాలికంగా మూసివేయాలని కోర్టు ప్రతిపాదించింది. జనవరి 31, 2026 వరకు ఢిల్లీ సరిహద్దుల్లో టోల్ వసూళ్లను నిలిపివేసేలా ఒక ప్రణాళికను రూపొందించాలని కోర్టు భావిస్తోంది. ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రతి ఏటా కాలుష్యం ఎక్కువగా ఉండే అక్టోబర్ 1 నుండి జనవరి 31 వరకు శాశ్వతంగా టోల్ వసూళ్లను నిలిపివేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోర్టు సూచించింది. జాతీయ రహదారులపై ప్రతి 5 లేదా 10 కిలోమీటర్లకు ఒకటి కాకుండా.. కనీసం 50 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజాలు ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ట్రాఫిక్ మళ్లింపు సులభమవుతుందని, నగర సివార్లలో రద్దీ తగ్గుతుందని కోర్టు పేర్కొంది.
వాయు కాలుష్యం కారణంగా స్కూల్స్ మూసివేయడంపై దాఖలైన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. స్కూల్స్ తెరవాలా లేదా మూసివేయాలా అనేది నిపుణులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని.. ఇది న్యాయస్థానాల పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. స్కూల్స్ మూసివేయడం వల్ల పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరమవుతున్నారని సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. సంపన్న వర్గాలు పాఠశాలలను పూర్తిగా మూసివేయాలని కోరుతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా స్కూల్స్ తెరవాలని కోరుతున్నారని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో కోర్టు 'సూపర్ స్పెషలిస్ట్' లాగా వ్యవహరించలేదని సీజేఐ అన్నారు.
హైబ్రిడ్ మోడల్ వైపు మొగ్గు..
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం 5వ తరగతి వరకు స్కూల్స్ పూర్తిగా మూసివేసింది. అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ (హైబ్రిడ్) విధానాన్ని అన్ని తరగతులకు వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. దీనిపై నిపుణుల కమిటీ శాస్త్రీయంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మొత్తానికి ఢిల్లీ కాలుష్య నివారణకు అటు పాలనాపరమైన చర్యలు, ఇటు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
