పద్మారావునగర్, వెలుగు: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కులవృత్తులకు తగిన ప్రోత్సాహం లభించడం లేదని, కేసీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలతో ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో బన్సీలాల్‌పేట నాయీబ్రాహ్మణ సేవా సంఘం కొత్త కార్యవర్గ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలవగా, ఈ సందర్భంగా తలసాని వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కులవృత్తుల వారు ఐక్యంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రామచందర్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, కోశాధికారి జయకృష్ణతో పాటు పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
