వరంగల్ నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేయండి : గంట రవికుమార్

 వరంగల్ నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేయండి : గంట రవికుమార్

ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: వరంగల్ నగరంలో ముంపు ప్రాంతాలు ఏటా పెరుగుతున్నాయని, నాలాల కబ్జా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చినుకు పడితే నగరవాసులు భయపడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు.  శుక్రవారం డబ్ల్యూజీఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ని కలిసి, నగరంలో పెండింగ్​పనులను పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఖిలావరంగల్​లోని అగర్తల చెరువు కాల్వ ద్వారా శివనగర్​పై ప్రాంతం నుంచి వర్షపు నీరు శివనగర్, పెరిక వాడ, ఎస్.ఆర్.ఆర్తోట అండర్​బ్రిడ్జి తదితర ప్రాంతాలను ముంచెత్తుతోందని తెలిపారు.

 చెరువు నుంచి చేపడుతున్న డ్రైనేజీ పనులు ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో సంతోషిమాత గుడి పరిసరాలు, హంటర్​ రోడ్, కాజీపేట రైల్వే ట్రాక్​తదితర ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేటర్లు ఆడెపు స్వప్న, గందె కల్పన, రత్నం సతీశ్​షా, బాకం హరిశంకర్,  కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, వెంకటేశ్, కూచన క్రాంతి కుమార్, ఆడెపు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.