
రోజూ మనం తీసుకునే ఆహారంలో అన్నం చాలా ముఖ్యమైంది.మొన్నటివరకు తెల్లగా, పొడిపొడిలాడుతూ ఉండే అన్నాన్నే అందరూ ఇష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడు పోషకాలు ఉన్నాయని. కొంతమంది బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అవుతుంటే.. మరి కొంతమంది వైట్ రైసే బెస్ట్ అంటున్నారు. ఇంతకి అసలు వైట్ రైసు, బ్రౌన్ రైస్ కు తేడా ఏంటి? ఎందులో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. ఎవరు ఏ రైస్ తినాలి.. షుగర్.. బీపీ ఉన్న వారికి ఏ రైస్ బెస్ట్.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ప్రతీ ఆహారంలో ఏనోకొన్ని పోషకాలుంటాయి. అయితే ఎవరికి ఎలాంటి పోషకాలు అవసరం.. ఏయే సమస్యలు ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ..అనేది తెలుసుకొని డైట్ ప్లాన్ చేసుకోవాలి. రైస్ విషయానికొస్తే వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఈ రెండూ మంచివే..అయితే ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని తింటే మంచిది.
బ్రౌన్ రైస్ : బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయని బియ్యం. సాధారణంగా మనం తినే వైట్ రైస్ ని చాలా సార్లు పాలిష్ చేస్తారు. అందుకే అవి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అయితే కేవలం ఒక్కసారి. మాత్రమే పాలిష్ చేసిన బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇది గోధుమ రంగులో ఉంటాయి.
ఏమేం ఉంటాయి?
- బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బియ్యంతో వండిన అన్నాన్ని తింటే.. కొంచెం అన్నం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఫైబర్ ఉండడం వల్ల అన్నం అరగడానికి కూడా చాలా సమయం పడుతుంది. తిన్న తర్వాత ఆకలి వేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దీనివల్ల బరువు సులభంగా తగ్గొచ్చు.
- ఎముకలను ఆరోగ్యంగా ఉండేందుకు కూడా బ్రౌన్ రైస్ ఎంతగానో ఉపయోగపడతుంది. బ్రౌన్ రైస్ లో ఖనిజ లవణాలైన మెగ్నీషియం.... కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి .
- రోజూ బ్రౌన్ రైస్ తింటే శరీరానికి కావాల్సిన మాంగనీస్ లో 80 శాతం వరకు లభిస్తుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- బ్రౌన్ రైస్ లో ఉండే మెగ్నీషియం శరీరానికి -ఎక్కువసేపు శక్తినిస్తుంది. దీంతో ఎంత సేపు పని చేసినా అలసట ఉండదు. నీరసం రాదు. చురుగ్గా కూడా ఉంటారు.
- బ్రౌన్ రైస్ లో ఇన్ని మంచి పోషకాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో మంచి పోషకాలతో పాటు ఆర్సెనిక్ అనే విష పదార్థం కూడా ఉంటుంది. ఇది శరీరానికి అంత మంచిది కాదు. అయితే అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అందుకే బ్రౌన్ రైస్ ను రోజుకు ఒకసారికి పరిమితం చేస్తే మంచిది..
వీళ్లకు మంచిది
- షుగర్ ఉన్న వాళ్లకు బ్రౌన్ రైస్ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా దీని గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్, ఫైబర్, పాలిఫినాల్స్ కార్బొహైడ్రేట్లు రక్తంలోకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడాన్ని ఆలస్యం చేసి, షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతాయి.
- గుండె సమస్యలు ఉన్నవాళ్లకు కూడా బ్రౌన్ రైస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే సెలీనియం రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
- క్యాన్సర్, కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు కుడా బ్రౌన్ రైస్ కు మారడం బెటర్. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో ఉండే పాస్పరస్ శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఆకలిపై నియంత్రణ వస్తుంది. దీంతో తిండి తినాలనిపించదు. దాతో తెలియకుండానే బరువు తగ్గుతారు. రోజూ బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది
వైట్ రైస్:వైట్ రైస్ ను నాలుగైదు సార్లు పాలీష్ చేస్తారు. ఎక్కువ సార్లు పాలిష్ చేయడం వల్ల ఫైబర్ తో పాటు మిగతా పోషకాలన్నీ పోతాయి. అయినప్పటికీ దీనికుండే ప్రయోజనాలు దీనికున్నాయి.
ఏమేం ఉంటాయి?
- వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. తిన్నవెంటనే ఎక్కువ ఎనర్జీ వస్తుంది.
- వైట్ రైస్ చాలా లైట్ ఫుడ్. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. డయేరియా లాంటి సమస్యలు ఉన్న వాళ్లు సులభంగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. దానికి వైట్ రైస్ కి మించిన బెస్ట్ ఆప్షన్ లేదు.
- వైట్ రైస్ వండటం సులభం . బ్రౌన్ రైస్ తో పోలిస్తే చాలా తొందరగా ఉడుకుతుంది.
- వైట్ రైస్ లో టాక్సిన్స్ తక్కువగా ఉంటాయి. టాక్సిన్స్ అనేవి దీర్ఘ కాలంలో శరీరానికి హాని చేస్తాయి. వైట్ రైస్ లో ఈ టాక్సిన్స్ చాలా తక్కువ. ఒకవేళ ఎక్కువగాఉన్నా అన్నం వండినపుడు నశించిపోతాయి.
- వైట్ రైస్ లో మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తికి... మెమరీ పవర్ కి ఉపయోగపడుతుంది
వీళ్లకు మంచిది
- వైట్ రైస్.. స్పోర్ట్స్ ఆడే వాళ్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా లైట్ ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయి వెంటనే కార్బోహైడ్రేట్స్ విడుదల చేస్తుంది. దీన్ని తినగానే తక్షణ శక్తి వస్తుంది.
- బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ ఎక్కువ గ్లైసమీక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఎక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా గ్లూకోజ్ మారుతుంది.
- కండలు పెంచాలనుకునే వాళ్లు వైట్ రైస్ ను ఎంచుకుంటే మంచిది. వైట్ రైస్ లో ఎసెన్షియల్ అమైనోయాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
- మాంసాహారాన్ని వైట్ రైస్ కలిపి తీసుకోవడం వల్ల మజిల్ బిల్డ్ చేయడానికి అవసరం అయ్యే పూర్తి పోషకాలు వీటి ద్వారా అందుతాయి.
- జీర్ణకోశ సమస్యలు, డయేరియా ఉన్నవాళ్లకు వైట్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. వైట్ రైస్‌లో గ్లూటెన్ ఉండటం వల్ల ఇది డయేరియాను నివారిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరిచి పొట్ట సమస్యలను నివారిస్తుంది
అవసరాన్ని బట్టి
సింపుల్ గా చెప్పాలంటే వైట్ రైస్ లో విటమిన్లు తక్కువ, కార్భొ హైడ్రేట్లు ఎక్కువ. బ్రౌన్ రైస్ లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తుంది. ఇంతా విటమిన్లు, ఫైబర్, మాంగనీసు, మెగ్నీషియం ఉంటాయి.