హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్షయపాత్ర ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకొని, 5 బిలియన్ భోజనాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
అక్షయపాత్ర వ్యవస్థాపకుడు, చైర్మన్ మధు పండిట్ దాస్, వైస్ చైర్మన్ చంచలపతి దాస్, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస్ ఆధ్వర్యంలో ‘వికసిత భారత్ కోసం సుపోషిత, సుశిక్షిత భారత్’ అంశంతో వేడుకలు నిర్వహించారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 78 కేంద్రాల ద్వారా రోజుకు 23.5 లక్షల మంది పిల్లలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే 2030 నాటికి రోజూ 30 లక్షల మంది పిల్లలకు సేవలను అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్రపతి భోజనం వడ్డించారు.
