హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. మంగళవారం లోక్ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఈ నూతన సంవత్సరం అందరి కుటుంబాల్లో ధన, ఆరోగ్యం, సంతోషాలను నింపాలని కోరుకుంటున్నా. అరవై ఏళ్ల కాలచక్రంలో ‘పరాభవ’ 40వ సంవత్సరం. పరాభవం అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఓడించి, విజయానికి పునాది వేసేది. గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ, మరింత నిబద్ధతతో లక్ష్యాల వైపు అడుగులు వేయాలి’ అని శుభాకాంక్షలు తెలిపారు.
