- ఈ సెషన్లోనే అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు తెస్తామని వెల్లడి
- వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన పార్టీ అగ్రనేతలు
- సీఎం వెంట పీసీసీ చీఫ్మహేశ్గౌడ్, రాష్ట్ర ఎంపీలు
- ఇయ్యాల రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులను కలిసే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా ఈ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లని వివరించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. రాత్రి 9 గంటలకు ఖర్గే నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షట్కర్, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
సీఎం తొలుత వేం నరేందర్ రెడ్డిని ఖర్గేకు పరిచయం చేశారు. వేం నరేందర్ రెడ్డికి ఖర్గే శుభాకాంక్షలు చెప్పారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. అంతకు ముందు ఇందిరా భవన్ లో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో.. వేం నరేందర్ రెడ్డిని కేసీకి సీఎం పరిచయం చేశారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ–ప్రభుత్వ వ్యవహారాలను చర్చించారు.
బడ్జెట్ అంశాలపై చర్చ
సామాజిక న్యాయం పాటించేలా.. అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఖర్గేకు సీఎం వివరించారు. ప్రభుత్వం– పార్టీ మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ల నియామకం, బడ్జెట్ సెషన్, పార్టీలోని పోస్ట్ ల భర్తీపై చర్చ జరిగినట్లు సమాచారం.
గిగ్ వర్కర్స్ బిల్లు, ఇతర అంశాలపై చర్చ..
కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశంతో ఈ బడ్జెట్ సెషన్ లోనే గిగ్ వర్కర్ల బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు వివరించారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో టీమ్ కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
రాహుల్ దిశానిర్దేశంలో మంత్రి వివేక్ అనేక అంశాలను స్టడీ చేసి బిల్లు తయారు చేసినట్లు వివరించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ఈ బిల్లుతో రాష్ట్రంలో పని చేస్తున్న దాదాపు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లకు లబ్ధి చేకూరనుందని వివరించారు.
రాహుల్, కేంద్ర మంత్రులను కలిసే చాన్స్
ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు పార్లమెంట్ లో లోక్ సభ రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలిసింది. ఈ సందర్బంగా బడ్జెట్, గిగ్ వర్కర్ల బిల్లు, ఇతర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తారని సమాచారం. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ తదితరుల అపాయిట్మెంట్ కోరినట్లు తెలిసింది.
మంత్రులు అపాయిట్మెంట్ ఇస్తే.. పార్లమెంట్ లోనే వారితో భేటీ అయ్యే చాన్స్ ఉంది. బుధవారం అసెంబ్లీలో సీఎం స్పీచ్ ఉన్న నేపథ్యంలో.. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం.
