మారణహోమం ఖాయమని తెలిసే ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ తిరుగుబాటు పిలుపు!

మారణహోమం ఖాయమని తెలిసే ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ తిరుగుబాటు పిలుపు!

ఇరాన్ అంతర్గత పరిస్థితులపై ఇజ్రాయెల్ చేస్తున్న విశ్లేషణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రస్తుత పాలనను అంతం చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్న ఇజ్రాయెల్.. మరోవైపు లోలోపల మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడితే.. వారు ప్రభుత్వ చేతిలో అత్యంత దారుణంగా మారణహోమానికి గురవుతారని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు అమెరికా దౌత్యవేత్తల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గత రెండు వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వంటి కీలక నేతలు హతమయ్యారు. అయినప్పటికీ ఇరాన్ పాలక యంత్రాంగం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని, చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంకా బలంగానే ఉందని, జనవరిలో జరిగిన నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. మరోసారి తిరుగుబాటు వస్తే ప్రభుత్వం మరింత క్రూరంగా వ్యవహరించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది.

ఈ ద్వంద్వ వైఖరిపై విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను విప్లవం వైపు ప్రేరేపిస్తూనే.. వారు చనిపోతారని ముందే ఊహించడం ఇరాన్ పౌరుల ప్రాణాల పట్ల ఇజ్రాయెల్‌కు ఉన్న ఉదాసీనతను చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవీ కూడా 'చహర్షాంబే సూరి' పండుగ సందర్భంగా ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. అయితే ఇరాన్ నిరంకుశ పాలనను అంతం చేసే క్రమంలో సామాన్య ప్రజలను బలిపశువులను చేస్తున్నారనే భావన ఇరాన్ పౌరుల్లో వ్యక్తమవుతోంది.

ప్రస్తుతానికి ఇరాన్‌లోని అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, అంతర్గత భద్రతా దళాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. "ఈ ఉగ్రవాద పాలనను అంతం చేసి, ఇరాన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పిస్తాం" అని ప్రధాని నెతన్యాహు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత భయానకంగా ఉంది. ప్రభుత్వ అణిచివేత దళాలు ఇంకా పటిష్టంగా ఉండటంతో, సామాన్య ప్రజల తిరుగుబాటు రక్తాపాతానికే దారితీస్తుందనే భయం కనిపిస్తోంది.