ఏడాది లో ఓఆర్ఆర్ లోపల 2,800 ఎలక్ట్రిక్ బస్సులు : మంత్రి పొన్నం

ఏడాది లో ఓఆర్ఆర్ లోపల 2,800 ఎలక్ట్రిక్ బస్సులు : మంత్రి పొన్నం
  •     ఈవీ కొనుగోలుదారులకు ఇప్పటికే వెయ్యి కోట్ల రాయితీలిచ్చాం: మంత్రి పొన్నం
  •     హైదరాబాద్ లో నేషనల్ మొబిలిటీ సమిట్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ప్రజా రవాణాను బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఐసీసీ నోవాటెల్‌‌‌‌లో  రెండో 'నేషనల్ మొబిలిటీ సమిట్-2026'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఇప్పటికే దాదాపు రూ. 1000 కోట్ల  విలువైన రాయితీలు కల్పించామని వెల్లడించారు. 

రాష్ట్రంలో కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు మంజూరు చేశామని, అలాగే నగరంలో ప్రస్తుతం తిరుగుతున్న 20 వేల డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని వివరించారు. 2027 నాటికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. వీటికి అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విజన్ 2047 దిశగా అడుగులు

మెట్రో కనెక్టివిటీ, బస్సు సేవలను మెరుగుపరుస్తూ ప్రతి పౌరుడికి చివరి మైలు వరకు రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సమిట్ ప్రధాన ఉద్దేశమని పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని 'విజన్ 2047' సాధనకు ఇటువంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.