- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని, ఆయనను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిలో ఒక బీసీ నేత ఉంటే, ఆయన్ని తొలగించి జగ్గారెడ్డిని నియమించాలని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన బీసీ వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులైన తర్వాతే రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ వేగవంతమైందని జాజుల గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సామాజిక మార్పులను తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.
పార్టీ పదవుల్లో 70 శాతం బహుజనులకు కేటాయించడం, డీసీసీ అధ్యక్షుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు బీసీలకు మేలు చేశాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించడం.. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు పెద్ద సంఖ్యలో విజయం సాధించడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీసీలపై కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలని జాజుల డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
