ముషీరాబాద్, వెలుగు: సరైన మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత కారణంగా చదవలేకపోతున్నామని దోమల్‌గూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం కాలేజీ ఎదుట నిరసన చేపట్టి గేటుకు తాళాలు వేసి తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని వాపోయారు.
కేవలం అటెండెన్స్ మాత్రమే తీసుకుంటున్నారని, చదువు చెప్పడం లేదని ఆరోపించారు. కాలేజీ గ్రౌండ్స్‌ను బయట వ్యక్తులకు అద్దెకు ఇస్తున్నారని తెలిపారు. కాలేజీ భవనం శిథిలావస్థకు చేరిందని, భయాందోళనల మధ్య చదువుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి బోధన సిబ్బందిని నియమించి, అవసరమైన వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
