
హైదరాబాద్: మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరో నెంబర్ బోగీ పట్టాలు తప్పినట్లు గుర్తించి లోకో పైలట్ రైలును నిలిపేశాడు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీని పక్కకు తొలగిస్తున్నారు.
ALSO READ | మృతదేహాలు కాదు.. శాంపిల్స్ ప్యాక్ చేసిన బాక్సులు: మంత్రి దామోదర రాజనర్సింహ క్లారిటీ
గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో మహబూబ్ నగర్-కర్నూల్ మార్గంలో 3 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెంగల్ పట్టు ఎక్స్ప్రెస్, హంద్రీ ఎక్స్ప్రెస్, మైసూర్ ఎక్స్ప్రెస్, సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే సిబ్బంది ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. త్వరలోనే రైళ్లు రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. గూడ్స్ పట్టాలు తప్పడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.