మృతదేహాలు కాదు.. శాంపిల్స్‌ ప్యాక్ చేసిన బాక్సులు: మంత్రి దామోదర రాజనర్సింహ క్లారిటీ

మృతదేహాలు కాదు.. శాంపిల్స్‌ ప్యాక్ చేసిన బాక్సులు: మంత్రి దామోదర  రాజనర్సింహ క్లారిటీ

హైదరాబాద్: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి డెడ్‎బాడీలను అట్టపెట్టెల్లో తరలిస్తున్నారనే ఆరోపణలకు మంత్రి దామోదర రాజనర్సింహ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (జూలై 4) ఆయన కార్యాయలం ఒక ప్రకటన జారీ చేసింది. సిగాచి పరిశ్రమ పేలుడు స్థలం నుంచి ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన సాంపిల్స్‌ ప్యాక్ చేసిన బాక్సులను మృతదేహాలు భద్రపరిచిన బాక్సులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అవి మృతదేహాలు కాదని.. కేవలం పరీక్షల కోసం సేకరించిన సాంపిల్స్‌ను ప్యాక్ చేసిన బాక్సులు అని వివరణ ఇచ్చారు.

ALSO READ | సిగాచీ కంపెనీకి రూ.200 కోట్లుపైనే ఇన్సూరెన్స్ వస్తుందా..? : మరి బాధితుల సంగతేంటి..

బాధిత కుటుంబ సభ్యుల మనోభావాలను గౌరవిస్తూ మృతదేహాల అప్పగింతలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి మృతదేహాం/శరీర భాగాల నుంచి సాంపిల్స్‌ను సేకరించి, వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు(FSL) పంపిస్తున్నారని చెప్పారు. ఈ సాంపిల్స్‌ను ఉపయోగించి శాస్త్రీయంగా డీఎన్‌ఏ పరీక్షలు చేసి, కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోల్చి చూసి, డీఎన్‌ఏ మ్యాచ్ అయిన ప్రతి మృతదేహాన్ని ఫ్రీజర్‌‌లో పెట్టి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. 

ఫ్రీజర్‌‌లను అంబులెన్స్‌లలో ఉంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి స్వగ్రామాలకు ఉచితంగా తరలిస్తున్నారని తెలిపారు. దహన సంస్కారాలు, ఇతర అవసరాల కోసం మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసిందని గుర్తు చేశారు. అలాగే, పూర్తిస్థాయిలో కోటి రూపాయల పరిహారం కంపెనీ నుంచి అందజేయడం జరుగుతుందని చెప్పారు. 

ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సిగాచి క్షతగాత్రులకు చికిత్స, బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సహకారం అందిస్తున్నారని తెలిపారు.పఠాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌లో మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచి, డీఎన్‌ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు.