
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. తాను ప్రతిష్టాత్మకంగా భావించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా మార్చుకున్నారు. ట్రంప్ శుక్రవారం(జూలై 4, 2025న) "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" (One Big Beautiful Bill) చట్టంపై సంతకం చేశారు. ఇది ట్రంప్ రెండోసారి పాలన చేపట్టిన తర్వాత సాధించిన చట్టపరమైన విజయం.
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో ఏముంది..?
"వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" అనేది అధికారిక పేరు కాకుండా ట్రంప్ స్వయంగా ఉపయోగించిన పేరు. ఈ చట్టం అనేక ముఖ్యమైన విధానాలను ఒకే ప్యాకేజీలో చేర్చింది. ఇవి ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా తన ఎజెండాలో కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఈ బిల్లులో ఉన్న ప్రధాన అంశాలు..
పన్ను కోతలు (Tax Cuts): 2017లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పన్ను కోతలను ఈ బిల్లు శాశ్వతం చేస్తుంది. కొత్తగా టిప్స్, ఓవర్ టైమ్ పే ,అమెరికాలో తయారైన కార్ల కొనుగోలుపై తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీకి తాత్కాలిక పన్ను మినహాయింపులు ఉంటాయి. ఏడాదికి 75వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించే వృద్ధులకు 6వేల డాలర్లవరకు పన్ను రాయితీ లభిస్తుంది.చైల్డ్ టాక్స్ క్రెడిట్ 2వేల డాలర్లనుంచి 2వేల200డాలర్లకు పెరగనుంది.
స్టేట్ అండ్ లోకల్ టాక్స్ (SALT) డిడక్షన్ పై ఉన్న 10వేల డాలర్ల లిమిట్ ను ఐదేళ్లపాటు 40వేల డాలర్లకి పెంచారు. ఇది న్యూయార్క్ వంటి అధిక ట్యాక్సులు కడుతున్న రాష్ట్రాల్లోని పౌరులు ప్రయోజనం పొందనున్నారు.
సరిహద్దు భద్రత ,వలస విధానాలు..
ఈ చట్టం ద్వారా కావడంతో సరిహద్దు,జాతీయ భద్రతా ఎజెండా కోసం సుమారు 350 బిలియన్ డాలర్లను కేటాయించనున్నారు. ఇందులో US-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ల డాలర్లు, లక్షమంది వలసదారుల నిర్బంధ సౌకర్యాల కోసం 45 బిలియన్ల డార్లు ఖర్చు చేయనున్నారు.
US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ICE) లో అదనంగా 10వేల మంది ఏజెంట్ల నియామకానికి సుమారు 30 బిలియన్ల డాలర్లు కేటాయించారు. ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద సామూహిక బహిష్కరణ (deportation) ఆపరేషన్ ను లక్ష్యంగా ఈ కేటాయింపులు చేశారు. ఇక అమెరికా ఆశ్రయం కోరేవారికి కొత్తగా 100 డాలర్ల ఫీజు వసూలు చేయనున్నారు.
సంక్షేమ పథకాలలో కోతలు ...
తక్కువ ఆదాయం ,వికలాంగుల కోసం ఉద్దేశించిన ఆరోగ్య కార్యక్రమం మెడికేడ్ (Medicaid)లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. దీంతో వృద్దులు, వికలాంగులపై భార పడనుంది. నేషనల్ కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం..రాబోయే పదేళ్లలో సుమారు 11.8 మిలియన్ల మంది ప్రజలు మెడికేడ్ కవరేజీని కోల్పోవచ్చు.
ఈ చట్టం ద్వారా ఫుడ్ స్టాంప్ బెనిఫిట్స్ (SNAP) విషయంలో కొన్ని రాష్ట్రాలపై ఖర్చు భారం పెరిగింది. 2028 నుంచి 6% కంటే ఎక్కువ లోపాల రేటు ఉన్న రాష్ట్రాలు SNAP ప్రయోజనాల కోసం 5శాతం నుండి 15శాతం ఖర్చులను భరించాల్సి ఉంటుంది. SNAP ఉద్యోగుల ఏజ్ లిమిట్స్ కూడా మార్చారు. గతంలో వారి అర్హత వయస్సును 18నుంచి-54 మధ్య ఉండగా 64కి పెంచారు.
రక్షణ రంగంలో..
సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచారు.ఇందులో నౌకా నిర్మాణం, ఆయుధ వ్యవస్థలు ,సైనికుల జీవన నాణ్యత మెరుగుదలకు నిధులు భారీగా కేటాయించారు. గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధి కోసం 25 బిలియన్ల డాలర్లు కేటాయించారు.