డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న వాట్సన్ మృతి

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న వాట్సన్ మృతి

న్యూయార్క్: ప్రఖ్యాత అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్, డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని కనుగొన్నవారిలో ఒకరైన జేమ్స్ డి. వాట్సన్ (97) కన్నుమూశారు. న్యూయార్క్ స్టేట్​లోని లాంగ్ ఐల్యాండ్​లో వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆయన గురువారం మృతిచెందారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. జేమ్స్ వాట్సన్ 1928 ఏప్రిల్ 6న షికాగోలో జన్మించారు. చిన్నప్పటి నుంచే పక్షులు, ప్రకృతి అంటే విపరీతమైన ఇష్టం ఉన్న వాట్సన్ మొదట ఆర్నిథాలజిస్ట్ అవ్వాలనుకున్నారు. 

తర్వాత కాలంలో జెనెటిక్స్​పై ఆసక్తి పెంచుకున్న ఆయన జీవులకు తరతరాలుగా వారసత్వ లక్షణాలను అందిస్తున్న డీఎన్ఏపై పరిశోధనల వైపు మళ్లారు. 1950లో లండన్​కు వెళ్లి కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఫ్రాన్సిస్ క్రిక్​తో కలిసి పరిశోధనలు ప్రారంభించారు. డీఎన్ఏ ఆవిష్కరణకుగాను వాట్సన్​, క్రిక్, మారీస్ విల్కిన్స్ లకు 1962లో ఫిజియాలజీ(మెడిసిన్)లో నోబెల్ లభించింది. 

కాగా, సైంటిస్టుగా బయాలజీ గతినే మార్చిన జేమ్స్ వాట్సన్.. తన మలిదశ జీవితంలో జాతివివక్ష వ్యాఖ్యలతో తీవ్ర వివాదాస్పదం అయ్యారు. అనేక జాతుల మధ్య తెలివితేటల్లో తేడాలు ఉండటానికి జెనెటిక్సే కారణమని పదే పదే చెప్పారు. దీంతో అవార్డులు, సత్కారాలతో గౌరవించిన సంస్థలు కూడా ఆయనను తీవ్రంగా నిరసించాయి.