శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’(Mrithyunjay). రెబా మోనికా జాన్ హీరోయిన్. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇవాళ శుక్రవారం (మార్చి 6, 2026న) సినిమా థియేటర్లోకి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డెత్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
మైండ్ గేమ్ ఎలిమెంట్స్‌తో నడిచే థ్రిల్లర్ కథ కావడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్ అనే టాక్ వస్తోంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, శ్రీవిష్ణు యాక్టింగ్, సెకండాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్ అనే టాక్ వస్తోంది.
మృత్యుంజయ్ కథ:
హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో జయ్ (శ్రీ విష్ణు) ఉద్యోగం చేస్తాడు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఇవ్వించడమే అతని పని. అయితే, ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటున్న అతను, ఒక వారం వ్యవధిలో అనుమానాస్పదంగా జరిగిన రెండు మరణాలపై సందేహం పెంచుకుంటాడు.
వాటిలో ఒకటి చిన్నారి అంజలి (ఊహా రెడ్డి) తండ్రి అచ్యుత్‌రావు (బాలాదిత్య) మరణం. అది సహజ మరణం కాదని హత్య అని జయ్ అనుమానించి, ఏసీపీ సీతగా (రెబా మౌనిక జాన్) దృష్టికి తీసుకెళ్తాడు. అయితే ఆమె అది ప్రమాదమని భావిస్తుంది. చివరికి జయ్ తన అనుమానాన్ని ఎలా నిరూపించాడు? ఆ హత్యల వెనక నిజం ఏమిటి? అనేదే సినిమా కథ.
సినిమా ఎలా ఉందంటే:
ఇటీవల వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీ విష్ణు ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించాడు. కథలోని మైండ్ గేమ్, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆసక్తిగా సీట్లో కూర్చోబెట్టేలా ఉంది. దర్శకుడు హుస్సేన్ కథను నెమ్మదిగా మిస్టరీ వైపు తీసుకెళ్లే విధానం బాగుంది. ఫస్టాఫ్ పాత్రల పరిచయంతో సాగితే, సెకండాఫ్లో ప్రేక్షకులను కట్టిపడేసింది.
చైల్డ్ సెంటిమెంట్, మైండ్ గేమ్‌తో నడిచే స్క్రీన్ ప్లే, పూర్తిగా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాకి ప్రధాన బలం. గ్రిప్పింగ్ కథను చెప్పడంలో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తన ప్రతిభను చక్కగా చూపించాడు. మొత్తానికి ‘మృత్యుంజయ్’ ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది.
ఎవరెలా నటించారంటే:
శ్రీ విష్ణు ఈ సినిమాలో చాలా సహజంగా నటించాడు. కామెడీ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సీరియస్ పాత్రలో కూడా తాను రాణించగలడని నిరూపించాడు. ఏసీపీ పాత్రలో రెబా మౌనిక సీరియస్ రోల్ ప్లే చేసింది. విలన్ పాత్రలో నటించిన వీర్ ఆర్యన్ తన పాత్రతో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సహాయ పాత్రల్లో నటించిన బాలాదిత్య, సుదర్శన్, ఐశ్వర్య, రచ్చ రవి, చిన్నా తదితరులు కథకు తగ్గట్టుగా నటించారు.
