- ఆ దేశం మైనార్టీ తెగల హక్కులను ఉల్లంఘిస్తోందని మండిపాటు
- 2026లో ఫ్లోరిడాలో జీ20 సమిట్ కు ఆతిథ్యం ఇస్తానని వెల్లడి
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సౌత్ ఆఫ్రికాలో ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగే జీ20 సమిట్ కు అమెరికా తరఫున ఎవరూ హాజరుకావడం లేదని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. జీ20 సమిట్ కు తాను వెళ్లబోనని ఇదివరకే చెప్పిన ట్రంప్.. తాజాగా తమ దేశం తరఫున ఒక్క అధికారిని కూడా పంపబోమని శుక్రవారం వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో మైనార్టీ ఆఫ్రికనర్స్ (డచ్, ఫ్రెంచ్, జర్మన్ వలసదారుల సంతానం) తెగల ప్రజల హక్కులను ఆ దేశ ప్రభుత్వం కాలరాస్తోందని ట్రంప్ ఆరోపించారు. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఓ చట్టం తెచ్చి.. ఎలాంటి నష్టపరిహారం సైతం చెల్లించకుండా ఆఫ్రికనర్ల వ్యవసాయ భూములను లాక్కుంటోందని అన్నారు.
మైనార్టీ తెగలపై ఈ జాతి వివక్ష, హక్కుల ఉల్లంఘన కొనసాగుతున్నంత కాలం సౌత్ ఆఫ్రికాకు తాము ఎలాంటి సహకారం అందించబోమని తేల్చిచెప్పారు. ఆఫ్రికనర్ రెఫ్యూజీలకు అక్కడి ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, 2026లో అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ మయామీలో జీ20 సమిట్‌ను ఘనంగా నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు.
ఈ సందర్భంగా ప్రపంచ నేతలకు మయామీలోని తన గోల్ఫ్ క్లబ్ లో ఆతిథ్యం ఇస్తానన్నారు. కాగా, జీ20 సమిట్ కు ఇండియా 2023లో ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలను బ్రెజిల్ చేపట్టింది. 2024 డిసెంబర్ 1న జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు అందుకున్న సౌత్ ఆఫ్రికా ఈ నెల 22, 23వ తేదీల్లో జోహెన్నెస్‌బర్గ్‌లో సమిట్ నిర్వహించనుంది.
మోదీ తప్పక వెళ్తారు: కాంగ్రెస్
జీ20 సమిట్కు ట్రంప్ హాజరుకావడంలేదు కనుక ప్రధాని మోదీ తప్పకుండా హాజరవుతార ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. పార్టీ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘జీ20 సమిట్కు వెళ్లబోనని ట్రంప్ ప్రకటించారు. దీంతో మోదీ ఈ సమిట్కు తప్పకుండా వెళ్తారు” అని ట్వీట్ చేశారు. ఇటీవల కౌలాలంపూర్‌లో జరిగిన ఏసియాన్ సమిట్కు ట్రంప్ హాజరు కాగా, మోదీ వెళ్లలేదు. దాంతో ట్రంప్‌కు భయపడుతున్నందుకే మోదీ వెళ్లలేదని కాంగ్రెస్ విమర్శించింది.
