బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి..ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు బీసీ నేతల రిక్వెస్ట్

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు పెట్టాలి..ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు బీసీ నేతల రిక్వెస్ట్
  • పార్లమెంట్ లో యూపీఏ తరఫున కేంద్రాన్ని నిలదీయండి

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రాన్ని నిలదీయాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఖర్గేను జాజుల ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు కలిశారు. దేశ, రాష్ట్ర స్థాయిలో బీసీలకు అమలు చేయాల్సిన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఖర్గేకు అందజేశారు. అనంతరం జాజుల మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ కేంద్రానికి పంపిన బిల్లు చట్ట రూపంలో దాల్చడానికి మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని అన్నారు.

  బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించేలా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేయాలని  ఖర్గేను కోరామని జాజుల తెలిపారు. పార్టీ నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కీలక పదవులను బీసీలకు కేటాయించాలన్నారు . బీసీలకు ఉపముఖ్యమంత్రితో పాటు మరో ఇద్దరు బీసీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పెంచాలని...సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని జాజుల డిమాండ్ చేశారు.ఖర్గేను కలిసిన వారిలో చిన్న శ్రీశైలం యాదవ్, కుందారం గణేశ్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


Hold Local Body Elections Only After Increasing BC Reservations: BC Leaders Urge Kharge