
ఇటీవల వరుస ప్రమాదాలతో ప్రయాణికులను బెంబేలిత్తిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. గురువారం ( సెప్టెంబర్ 18 ) విశాఖ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పక్షి ఇరుక్కోవడంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది.
ఇవాళ మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఈ విమానం ఇంజిన్లో పక్షి ఇరుక్కొని ఫ్యాన్ రెక్కలు దెబ్బతినడంతో.. మళ్ళీ వెనక్కి వేలి విశాఖ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానానికి చేర్చినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.