ఓట్ చోరీ ఇష్యూ: రాహుల్ గాంధీ, అమిత్ షా మధ్య మాటల యుద్ధం

ఓట్ చోరీ ఇష్యూ: రాహుల్ గాంధీ, అమిత్ షా మధ్య మాటల యుద్ధం

పాట్నా: కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ చేసే ఓట్ చోరీ ఆరోపణలన్నీ పూర్తిగా తప్పని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని బద్నాం చేయడానికి రాహుల్ గాంధీ పదే పదే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో బీహార్‎లో అసెంబ్లీ ఎన్నికల జరగనుండటంతో గురువారం (సెప్టెంబర్ 18) ఆ రాష్ట్రంలో అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా  బీహార్ బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర, ఓట్ చోరీ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. 

కానీ అలాంటిదేమి జరలేదు. ఇప్పుడు ఓట్ చోరీ అంటూ అదే తరహాలో మరో కొత్త నాటకానికి రాహుల్ గాంధీ తెరలేపారని విమర్శించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా బీహార్‎లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర చేప్టటారని ఆరోపించారు అమిత్ షా. బీహార్‎లో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం చొరబాటుదారులతో నిండిపోతుందని హాట్ కామెంట్ చేశారు.