Lawrence: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. తల్లి పేరుతో పేదలకు ఫైవ్ స్టార్ ఫుడ్!

Lawrence: రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. తల్లి పేరుతో పేదలకు ఫైవ్ స్టార్ ఫుడ్!

దాతృత్వానికి మరో పేరుగా నిలిచిన నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్.  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో.  లేటెస్ట్ గా లారెన్స్ ఒక అద్భుతమైన , ఆప్యాయతతో నిండిన గొప్ప ప్రాజెక్టును ప్రకటించారు.  తన తల్లి కన్మణి పేరు మీద '  కన్మణి అన్నదాన విరుండు' అనే రెస్టారెంట్ ను ప్రారంభించారు. సామాన్యులు కూడా ఉన్నత స్థాయి వంటకాల రుచిని అందించడమే.. దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.  సాధారణంగా ధనవంతులు మాత్రమే ఆస్వాధించే వంటకాలను అందిరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టును తాను మొదలుపెట్టినట్లు లారెన్స్ తెలిపారు.

ఆహారం ఆనందాన్ని పంచేదిగా ఉండాలి..

ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తూ.. తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా లారెన్స్ పంచుకున్నారు. ఇది ఒక కొత్త ప్రారంభం .. ఆహారం అనేది ప్రతి హృదయంలో చిరునవ్వులు తెచ్చే ఆనందాన్ని పంచేదిగా ఉండాలి. అది ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు. సమాజంలో వెనకబడిన వర్గాల వారికి, ముఖ్యంగా నరికురవర్గల్ కమ్యూనిటీ పిల్లలు, వృద్ధులకు తొలి రోజున విందును అందించిన వీడియోను కూడా ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు 

వివిధ రకాల వంటకాలను ఆస్వాదిస్తూ వారి ముఖాల్లో కనిపించిన సంతోషం తనను చాలా తృప్తి పరిచిందని లారెన్స్ భావోద్వేగంతో పంచుకున్నారు. అందరి ఆశీస్సులతో ఈ అన్నదాన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ప్రతి ఒక్కరికీ రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను  అని తెలిపారు. ఈ రెస్టారెంట్ ద్వారా నాణ్యమైన ఆహారంతో పాటు, వివిధ సంస్కృతులకు చెందిన వంటకాలను పరిచయం చేయాలనే ఆలోచన ఆయన దాతృత్వానికి మరో కోణాన్ని జోడించిదని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

 

 దాతృత్వంలో అంతులేని ప్రయాణం

 సినీ రంగంలో తన నటనతో పాటు సామాజిక సేవలోనూ లారెన్స్ ముందుంటారు. ఆరోగ్యం, విద్య, వరద సహాయం, కోవిడ్-19 ఉపశమనం వంటి వాటికి ఆయన తన సొంత డబ్బు నుండి ఎన్నో లక్షలు ఖర్చు చేసి సాయం చేశారు. అంతే కాకుండా అనాథాశ్రమాలను, వృద్ధాశ్రమాలను  ఆయన నిర్వహిస్తున్నారు. ఈ కొత్త  ' కన్మణి అన్నదాన విరుండు'  ప్రాజెక్ట్ ద్వారా, ఆహారాన్ని అందించడం అనేది ఆయన సేవా కార్యక్రమాల్లో ఒక ప్రత్యేక స్థానంగా నిలవనుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

సినిమా రంగంలో మాత్రమే కాకుండా, నిజ జీవితంలోనూ ఆయన చూపించే ఈ గొప్ప మనసు, ఇతరుల ఆనందమే తన ఆనందంగా భావించే లారెన్స్ లక్షణాన్ని మరోసారి రుజువు చేసిందని నెటిజన్లు అభినందిస్తున్నారు.  ' కన్మణి అన్నదాన విరుండు' రెస్టారెంట్ ద్వారా ఆయన సమాజానికి అందించే సేవ ఒక కొత్త మార్గాన్ని చూపించి, ఇతరులకు స్ఫూర్తినిస్తుందంటున్నారు.

లారెన్స్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'జిగర్ తండా: డబుల్ ఎక్స్' (Jigarthanda: Double X) చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం, లోకేష్ కనగరాజ్ ఫిల్మ్ యూనివర్స్‌లో భాగం కావచ్చని భావిస్తున్న 'బెంజ్' (Benz), అలాగే ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాంచన 4' (Kanchana 4) వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.