
హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 17) సాయంత్రం కురిసిన వానకు తడిసీ ముద్దయింది నగరం. మళ్లీ 9 గంటల ప్రాంతంలో మొదలైన వాన గంటపాటు కురుస్తూనే ఉంది. భారీ వర్షం కారణంగా సాయంత్రం నుంచి రోడ్లపై ట్రాఫిక్ జాం అయ్యి రాత్రి పది గంటలకు కూడా వాహనదారులు ఇంటికి చేరని పరిస్థితి. అయితే మరో రెండు గంటలు నగరంలో వర్షం దంచికొట్టనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అర్ధరాత్రి వరకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటికే నగరంలో వర్షం దంచి కొడుతోంది. ఉద్యోగులు, వాహనదారులు ఇంటికి చేరే టైమ్ లో ప్రారంభమైన వర్షం.. ఎక్కడా తగ్గకుండా విడవకుండా కురుస్తోంది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షం కారణంగా చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం సందర్భంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ imd సూచన చేసింది.
ఈ ఏరియాల్లో భారీ వర్షం.. మీ రూట్ చెక్ చేసుకోండి:
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో గంట నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. అదే విధంగా అటు నిజాంజేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ ఏరియాల్లో వర్షం గట్టిగా కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్ పల్లిలో కురిసన వర్షానికి నాళాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్. శివాజి నగర్, సంగీత్ సర్కిల్.. మారేడు పల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా నీరు చేరిపోయి వాహనాలు వెల్లడానికి ఇబ్బందికరంగా మారింది.
తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతాపూర్ లో జోరు వాన కురుస్తోంది. అటు సిటీ శివారులో వనా విజృంభిస్తోంది. బండ్లగూడ, జాగిర్ హైదర్ షా కోట్, కిస్మత్ పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ తదితర ప్రాంతాల్లో విడువకుండా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బండ్లగూడలో అపార్టుమెంట్లలోకి నీళ్లు చేరాయి.
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, మల్లాపూర్, హఫీజ్‌పేట్‌లో వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. గచ్చిబౌలి నేతాజీ నగర్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్టలో కూడా వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి భారీ వర్షానికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మియాపూర్‌లో 9.7, లింగంపల్లిలో 8.2, HCUలో 8.5, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.